హైదరాబాద్, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): ఓ వైపు ఎడతెరిపి లేని వర్షాలు.. మరోవైపు సర్కారు మొద్దునిద్ర, వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటా సగటున 7వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించేవరకూ పనులు చేపట్టేదిలేదని కాంట్రాక్టర్లు భీష్మించగా, రెండేళ్లుగా ప్రభుత్వం రోడ్డు మరమ్మతుల ఊసే మర్చిపోయింది. మరోవైపు, నిధులు, పనులు లేక అధికారులంతా ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 92వేల కిలోమీటర్లకుపైగా రోడ్ నెట్వర్క్ ఉంది. రోడ్లపై ఏర్పడే గుంతలను రెగ్యులర్ మెయింటెనెన్స్ కింద ఎప్పటికప్పుడు పూడ్చడం ఆనవాయితీ.
అంతేకాదు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు రోడ్లపై పడిన గుంతలను లెక్కించి వెంటనే రోడ్లను పునరుద్ధరించేవారు. అయితే, రెండేళ్లుగా ఈ ఆనవాయితీ పూర్తిగా తప్పింది. రోడ్డు మరమ్మతు పనులు పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి జరిగిన రోడ్డు మరమ్మతులకు సంబంధించిన సుమారు రూ. 150కోట్ల బిల్లులను కూడా విడుదల చేయకుండా నిలిపివేశారు. కాంట్రాక్టర్లు పలుమార్లు సచివాలయం వేదికగా ఆందోళనలు నిర్వహించగా, వారం రోజుల క్రితం రూ. 100కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు.
రెండేళ్లుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో కొంతకాలంగా కాంట్రాక్టర్లు అత్యవసర పనులను కూడా చేపట్టడంలేదు. కొన్నిచోట్ల అధికారులు కాంట్రాక్టర్లను బతిమిలాడి పనులు చేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ హయాంలో రోడ్డు పనులకు కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర పోటీ ఉండేది. 30-40శాతం వరకూ లెస్‌కు బిడ్లు దాఖలు చేసి పనులు దక్కించుకునేవారు. ఇప్పుడు రెండు-మూడు దఫాలు రీ-టెండర్ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వస్తున్నది. దీన్నిబట్టి ప్రభుత్వంపట్ల కాంట్రాక్టర్లకున్న అభిప్రాయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పనులు చేస్తే బిల్లులు రావని బలంగా నమ్ముతున్నారు. అందుకే పనులు చేపట్టడంలేదని సాక్షాత్తూ అధికారులే చెబుతుండటం విశేషం.
ఇటీవలి వర్షాలకు జిల్లాల్లో రోడ్ల పైపొర కొట్టుకొనిపోయి కంకరతేలి ప్రయాణానికి పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం కొత్త రోడ్లు నిర్మించడం దేవుడెరుగు.. ఉన్న రోడ్లకు కూడా మరమ్మతులు చేయించలేని దుస్థితికి చేరుకున్నది. చేవెళ్లలో ఇటీవల భారీ రోడ్డు ప్రమాదం జరగడంతో సమస్య తీవ్రత ఎలా ఉందో అందరికీ అర్థమైంది. రవాణా శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 25,934రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 7,281వేల మరణాలు సంభవించాయి. 15,401మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రెండేళ్లుగా ఏటా సగటున 7వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రోడ్ల స్థితిగతులను గమనించడం, పనులను పర్యవేక్షించడం ఇంజినీర్ల ప్రధాన బాధ్యత. అయితే, కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డప్పటినుంచి వారి షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. ఉన్నతాధికారులు, మంత్రి సమీక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఆఫీసుకు వచ్చి మమ అనిపించడం పరిపాటిగా మారిపోయింది. నిధులు ఎలాగూ లేవు కాబట్టి వారికి చేతినిండా పని లేకుండా పోయింది. ప్రజలకు అవసరమైన రోడ్లను పట్టించుకోని సర్కారు… ఇంజినీర్లకు మాత్రం పదోన్నతులు కల్పించి వారిని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవలే అన్నిస్థాయిల ఇంజినీర్లకు పదోన్నతులు కల్పించిన ప్రభు త్వం, ఇంకా ఎవరైనా మిగిలివుంటే వారికి కూడా రానున్న కొద్దిరోజుల్లోనే పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించడం గమనార్హం.