హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలపై ప్రీ ప్రైమరీ స్కూళ్ల కత్తి వేలాడుతున్నది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి వెయ్యి పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలనే ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారనున్నది. రెండేండ్ల చిన్నారులను చేర్చుకోవాలని నిశ్చయించడం సెంటర్లకు శాపంగా పరిణమించనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో 60 ఏండ్లుగా సేవలందిస్తున్న ఐసీడీఎస్‌ల ఉనికి ప్ర శ్నార్థకమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
చిన్నారులకు ప్రైవేట్ తరహాలో ఎల్కేజీ, యూకేజీ విద్యనందించే లక్ష్యంతో పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది వెయ్యి స్కూళ్లలో ప్రారంభించి క్రమేణా అన్ని స్కూళ్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించింది. మొదట నాలుగేండ్ల చిన్నారులను ఇందులో చేర్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది. కానీ, ఇప్పుడు రెండేండ్ల చిన్నారులకూ ప్రవేశాలు కల్పించాలని నిశ్చయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీలను బలోపేతం చేసి ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దవచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్ల పేరిట సెంటర్లను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్లలోని పిల్లలను తీసుకోమని మొదట చెప్పారు. కొత్తగా ఎన్రోల్మెంట్ చేస్తామని పేర్కొన్నారు. ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంగన్వాడీల్లో సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం, పూర్వ ప్రాథమిక పాఠశాలలతో ఒరగబెట్టేదేం ఉండదని మండిపడుతున్నారు. ప్రచా రం కోసమే ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.