హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో దవాఖానలో చేరే పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఆరోగ్య భద్రత పథకా న్ని ద్వారా ఆపన్నహస్తం అందించింది. ఎవరైనా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ద వాఖానలో చేరితే రూపాయి ఖర్చు లేకుండా చికిత్సకు సహకరించింది. పోలీసులపై భారం పడకుండా ప్రభుత్వమే బిల్లులు చెల్లించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం నిర్వీర్యమైందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా దవాఖానల్లో సే వలు నిలిచిపోయాయని మండిపడుతున్నారు.
పోలీసు ఆరోగ్యభద్రత పథకంలో భాగంగా చికిత్స అందించినందుకు దవాఖానలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. వీటిపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బకాయిలు చెల్లించకపోతే ఉచిత వైద్య సేవలు నిలిపివేస్తామని తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్‌ఏ) హెచ్చరించింది. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని అసోసియేషన్ సభ్యులు ఆశించారు. కానీ ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఎవరూ కనీసం స్పందించకపోవడంతో ఆదివారం నుంచే దవాఖానల్లో సేవలు నిలిచిపోయాయి. అడ్మిట్ అయిన వాళ్లకు కూడా సరైన సేవలు అందడం లేదని దవాఖానల్లో చికిత్స పొందుతున్న పోలీసుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పోలీసు ఆరోగ్య భద్రత పథకంలో దవాఖానల్లో రోజుకు 120 నుంచి 130 మంది అడ్మిట్ అవుతారు. వీటి ఖర్చు భరించడం ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదని బాధిత పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి, అహోరాత్రులు విధులు నిర్వర్తించే తమ పట్ల కనీస మానవత్వం, గౌరవం చూపకపోవడం దారుణమని మండిపడుతున్నారు. సేవలు నిలిపివేస్తామని దవాఖానలు హెచ్చరించినా ప్రభుత్వ పెద్దలు, హోంశాఖ అధికారులు హాస్పిటల్స్ అసోసియేషన్‌తో చర్చలు జరపకపోవడం తీవ్రంగా కలచివేస్తున్నదని వాపోతున్నారు. దవాఖానలకు బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నామని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి చెప్తున్నా ఆచరణలో ఎలాంటి ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దవాఖానలకు బకాయిల చెల్లింపులో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ఉందని కొందరు పోలీసు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దవాఖానలు పోలీసులకు ఉచిత వైద్యం నిలిపివేసినందున తమ కుటుంబాలకు సంబంధించిన వైద్య సమాచారం, ఇబ్బందులు, సౌకర్యాల విషయాలను ఉన్నతాధికారులకు తెలిపే ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని బాధిత పోలీసు కుటుంబాలు వేడుకుంటున్నాయి.