మహబూబ్‌నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే అరుణ.. రాయలసీమ ప్రాజెక్టులకు హారతిపట్టడం తప్ప ఉమ్మడి పాలమూరుకు చేసిందేమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్రా పాలకులు దోపిడీ చేస్తుంటే, నాడు చూస్తూ పదవులు అనుభవించిన డీకే అరుణ.. నేడు రాజకీయ లబ్ధి కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని పాలమూరు బిడ్డలు మండిపడుతున్నారు.
తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన సభలో ఎంపీ డీకే అరుణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు గురువింద గింజ సామెతను తలపిస్తున్నాయని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాపకం కోసం కేసీఆర్‌ను తూలనాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 2004లో సమాజ్‌వాది పార్టీ టికెట్‌పై గద్వాల నియోజకవర్గం నుంచి గెలుపొందిన డీకే అరుణ.. ఆ తరువాత కాంగ్రెస్ చేరి 2018 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఐదేండ్లపాటు మంత్రి పదవి కూడా అనుభవించారు.
అధికారం అనుభవించినప్పుడు గుర్తుకురాని పాలమూరు జిల్లా ప్రాజెక్టులు ఇప్పుడు గుర్తుకొచ్చాయా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో చేపడుతున్న నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను డీకే అరుణ భర్త, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి అడ్డుకొని కోట్ల రూపాయల కమీషన్ కోసం కాంట్రాక్టర్‌ను బెదిరిస్తే.. అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలతో కేసులు నమోదుచేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2005లో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నెట్టెంపాడు ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. జూరాల ప్రాజెక్టు సోర్స్‌గా దీన్ని చేపట్టారు. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లు ఏర్పాటుచేసి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
అప్పట్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు వైఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ముందే బిల్లులు చెల్లించింది. దీంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌కు డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి నుంచి బెదిరింపులు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రాజెక్టు పనులను కమీషన్ల కోసం ఆపడంతో సీరియస్‌గా తీసుకున్న అప్పటి వైఎస్ ప్రభుత్వం కేసులు నమోదు చేయడమే కాకుండా, భరత్‌సింహారెడ్డి ప్రధాన అనుచరుడు గడ్డం కృష్ణారెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించింది.
మాజీ ఎమ్మెల్యేగా ఉన్న భరతసింహారెడ్డిని సైతం మహబూబ్‌నగర్ ఎస్పీ ఆఫీసుకు పిలిపించి కమీషన్ల బాగోతంపై సుదీర్ఘంగా విచారణ జరిపారు. దీంతో అరెస్టు కాకుండా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకొని ముందస్తు బెయిల్ తీసుకున్నారని అప్పట్లో గుప్పుమన్నది. సొంత నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించాలన్న సోయి డీకే అరుణకు లేదనడానికి ఈ ఘటన అద్దం పడుతున్నదని గద్వాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
2009 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన డీకే అరుణ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ క్యాబినెట్లో చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ ఆకస్మిక మృతి తరువాత కాంగ్రెస్ పార్టీలో సొంత బావ అయిన డీకే సమరసింహారెడ్డిని రాజకీయంగా అడ్డుతొలగించుకుని తమ బలం, బలగం పెంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న తరుణంలో జిల్లాలోని మరో మంత్రిని కూడా ఎదగనీయకుండా చేసి, ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కల్పించారనే విమర్శలున్నాయి. ఆ తర్వాత రాయలసీమలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి హోదాలో డీకే అరుణ పర్యటించి అక్కడి ఆంధ్రా ప్రాజెక్టులకు హారతి పట్టడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పాలమూరు జిల్లాలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుల కోసం మంత్రి హోదాలో డీకే అరుణ ఏ రోజు కూడా పోరాడలేదని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేస్తున్నారు. నాడు డీకే అరుణ జిల్లా లబ్ధి కోసం ప్రయత్నించి ఉంటే, తెలంగాణ రాకముందే ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవని అంటున్నారు.
తెలంగాణ రావడం ఖాయమని తెలిశాక హడావుడిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి 38 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. రెండు లక్షల ఎకరాలకు డిజైన్ చేసిన ఈ ఎత్తిపోతల పథకాన్ని చివరకు అసంపూర్తిగానే మిగిల్చి తమ రాజకీయ ప్రాపకానికి ఉపయోగించుకున్నారనే విమర్శలున్నాయి. మంత్రి హోదాలో ఉండి తన భర్తపై ఉన్న కేసులను కోర్టులో రాజీ కుదుర్చుకొని ఎత్తి వేయించుకున్నారు. అంతేకాకుండా, గద్వాల జిల్లాలో మైనింగ్ పేరిట గుట్టలను మాయం చేయడంతో ఆ శాఖ కొన్ని కోట్ల రూపాయల జరిమాన సైతం విధించగా, మంత్రి హోదాలో తొక్కిపెట్టారనే ఆరోపణలున్నాయి.
డీకే సమరసింహారెడ్డి రాష్ట్రమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 2004 ఫిబ్రవరి 18న నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో మొదటి దశలో 27వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు పనుల కోసం జీవో-25 విడుదల చేసి రూ.50 కోట్లు మంజూరు చేశారు. తిరిగి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధరూర్ మండలం ర్యాలంపాడు గ్రామం దగ్గర రెండో దశ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రస్తుతం లక్ష ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్నారు.
అయితే, ఈ ప్రాజెక్టు కింద రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా వైఎస్ సర్కార్ డిజైన్ చేసినప్పటికీ, నాడు కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లను బెదిరించి, కమీషన్లు దండుకుంటూ మరోరకంగా నిర్మించారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసి దాదాపు సగంపైగా ఆయకట్టును స్థిరీకరించారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో మూడు మోటార్లకు బదులు ఒకే మోటర్ రన్ చేస్తున్నారు. ఈ మోటర్‌ను పూర్తిస్థాయిలో రన్ చేస్తే కాల్వలు నిండిపోయి పొలాల్లోకి నీళ్లు మల్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ హయాంలో కాల్వలను కూడా సరైన పద్ధతిలో డిజైన్ చేయకపోవడంతో అనేక అక్రమాలకు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
మరోవైపు, జూరాల ప్రాజెక్టు ముందు భాగంలో వైఎస్ హయాంలోనే పార్కు నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికోసం కోట్ల రూపాయలు విడుదలైనప్పటికీ, కాంట్రాక్టర్లు ఎవరూ పనిచేయకుండా డీకే కుటుంబం బెదిరించిందనే ఆరోపణలున్నాయి. దీంతో జూరాల ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రదేశమంతా కంపతారు చెట్లతో నిండి ప్రజలు సేదదీరడానికి కూడా వీలు లేకుండా చేశారు. ఇటువంటి చరిత్ర ఉన్న డికే అరుణ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని పాలమూరు బిడ్డలు చర్చించుకుంటున్నారు.