హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకుల సొసైటీలో అనర్హులకు ఉద్యోగాలిచ్చారు. యూజీసీ నిబంధనలకు పాతరేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా, తాజాగా సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌కు సొసైటీ చర్యలు చేపట్టింది. సొసైటీలోని సిబ్బంది విద్యార్హత పత్రాలను పరిశీలించాలని ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీచేసింది. దీనంతటికీ రేవంత్‌రెడ్డి సర్కార్ అనుసరించిన విధానమే కారణమని తెలుస్తున్నది. ప్రచార ఆర్భాటం కోసం ఇష్టారీతిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారని, ఫలితంగానే అనర్హులకు పోస్టులు దక్కాయని నిరుడు అనేకమంది అ భ్యర్థులు ఆరోపించారు. నేడు సొసైటీ చర్యలతో ఆ ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతున్నది.
దూరవిద్యకు సంబంధించి 2013లో యూజీసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దాని ప్రకారం విశ్వవిద్యాలయాలు తమ ప్రాదేశిక అధికార పరిధి వెలుపల (రాష్టానికి వెలుపల) బ్రాంచ్‌లు, అధ్యయన కేంద్రాల ద్వారా దూరవిద్యను అందించకూడదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సైతం పలు మార్గదర్శకాలు జారీచేసింది. 2014 జూన్ 2 తర్వాత అంటే రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ, ఇతర విశ్వవిద్యాలయాలు నిర్వహించే అధ్యయన కేంద్రాల ద్వారా ప్రదానం చేసే డిగ్రీలు తెలంగాణలో ఉపాధి లేదా ఉన్నత విద్యకు అర్హతలుగా చెల్లబోవని స్పష్టంచేసింది.
2022లో ఇదే విషయమై హైకోర్టు సైతం తీర్పు చెప్పింది. రాష్ట్రం వెలుపలి యూనివర్సిటీలకు సంబంధించిన అధ్యయన కేంద్రాల ద్వారా పొందిన డిగ్రీలను ప్రభుత్వ ఉద్యోగానికి చెల్లుబాటయ్యేలా పరిగణించలేమని తేల్చిచెప్పింది. ఇంతస్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా మైనార్టీ గురుకులంలో 2024లో చేపట్టిన నియామకాల్లో పలువురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అనర్హులకు ప్రమోషన్లు కల్పించారు. ఇదే విషయమై ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దూరవిద్య సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందినవారి జాబితాను ఇవ్వాలని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్)కు, మైనార్టీ గురుకుల సొసైటీని కోరారు.
దీంతో ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రాల ద్వారా 2014 తరువాత డిగ్రీలు పొందిన అనేకమంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ప్రమోషన్లు కూడా పొందినట్టు తేలింది. దీంతో సదరు ఆర్టీఐ పిటిషనర్ తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు ఫిర్యాదుచేశారు. ట్రిబ్, మైనార్టీ గురుకుల సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఇచ్చారని, సదరు అపాయింట్మెంట్లను రద్దు చేయాలని కోరారు.
ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్ కమిషనర్‌కు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ట్రిబ్)కు ఉన్నత విద్యామండలి సైతం లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో మైనార్టీ గురుకుల సొసైటీలోని ఉద్యోగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికెషన్ ప్రక్రియను చేపట్టారు. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను పరిశీలించాలని సొసైటీ ఉన్నతాధికారులు మైనార్టీ గురుకుల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగి నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నుంచి పొందిన సర్టిఫికెట్లను సమర్పించి ఉంటే సత్వరమే విషయాన్ని తెలియజేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ సర్కారు 2023లో నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రిజల్ట్‌ను వెల్లడించలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో నియామక పత్రాలు ఇచ్చేందుకు హడావుడి చేసింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ట్రిబ్ రాత్రికేరాత్రే రిజల్ట్స్ వెల్లడించింది.
ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు రోజుకు 100 మంది చొప్పున మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించగా, ట్రిబ్ అందుకు భిన్నంగా సబ్జెక్టుల వారీగా 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులందరికీ ఒక్కరోజులోనే, అర్ధరాత్రి దాటేవరకూ సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించింది. గంటల వ్యవధిలోనే తుది జాబితాను ప్రకటించింది. రోజుల వ్యవధిలోనే అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ హడావుడిగా సాగడంతో పలువురు అనర్హులకు ఉద్యోగాలు దక్కాయి. మెడికల్ బోర్డు ధ్రువీకరణ లేకుండానే దివ్యాంగులకు నియామక పత్రాలను అందజేశారు. ఆ తరువాత నిర్దేశిత వైకల్యం లేదని, బోర్డు తిరస్కరించిందని పేర్కొంటూ పలువురు దివ్యాంగుల అపాయింట్మెంట్ ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా మైనార్టీ గురుకులంలో సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ చేపట్టారు. దీంతో పోస్టుల భర్తీ సందర్భంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ సజావుగా జరగలేదని స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ సర్కారు తీరు వల్ల 9,210 పోస్టుల్లో ప్రస్తుతం అనేకం ఖాళీ అయ్యాయి.