హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది. సకల హంగులతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపుదాల్చిన మెడికల్ కళాశాలలు.. నేడు పరికరాల బిల్లుల కోసం దేబరిస్తున్నాయి. కాలేజీలకు వివిధ వైద్య, ఇతర పరికరాలను సరఫరా చేసిన కంపెనీలకు ఏడాది రూ.90 కోట్ల నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
వీటిని పెండింగ్‌లో పెట్టి సివిల్ పనులకు ఆ నిధులను దారిమళ్లించి కమీషన్లు కొట్టేసే పనిలో కొందరు వైద్యశాఖ పెద్దలు కక్కుర్తి పడుతున్నారు. మితిమీరిన అవినీతితో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కమీషన్ల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్నది. మెడికల్ కాలేజీలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా వివిధ రకాల వైద్య పరికరాలను మొత్తం 50 కంపెనీలు సరఫరా చేశాయి. ఇందులో స్పెక్ట్రో మీటర్, స్పైర్ మీటర్, టిష్యూ ప్రాసెసర్ మిషన్, సెల్ కౌంటర్, మైక్రో స్కోప్, డిజిటల్ మీటర్, స్టెతస్కోప్, గ్యాస్ ఎనలైజర్, అనస్థీషియా వర్క్‌స్టేషన్, ఫర్నిచర్ సహా ఇతర పరికరాలను సరఫరా చేశారు. ఇందుకు సంబంధించి రూ.90 కోట్ల బిల్లులు ఏడాదిగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
బిల్లుల చెల్లింపు ప్రక్రియను వైద్యారోగ్యశాఖ పెద్దలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నట్టు తెలుస్తున్నది. పరికరాలకు చెల్లించాల్సిన రూ.90 కోట్లు విడుదల చేస్తే తమకు మిగిలేది ఏమీ ఉండదని భావించిన సదరు శాఖ పెద్దలు.. కొత్త వ్యూహానికి తెరలేపినట్టు సమాచారం. ఆ రూ.90 కోట్లను సివిల్ పనులకు కేటాయిస్తే 10% కమీషన్ కొట్టేయచ్చనేది ఈ వ్యూహం సారాంశంగా చర్చ జరుగుతున్నది. ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సిన ఆ రూ.90 కోట్లను అక్కడే అడ్డుకొని వాటిని సివిల్ పనులకు మళ్లించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని వైద్యారోగ్య శాఖలోని ఓ కీలకాధికారి చక్కబెడుతున్నట్టు తెలిసింది. బిల్లుల విషయంలో ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మిన్నకుండిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న రూ.90 కోట్ల బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంపై ఓ 18 కంపెనీలు ఎంఎస్ఎంఈ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కళాశాలలకు పరికరాలు సరఫరా చేసిన 50 కంపెనీలు పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం దక్కలేదు. తమ బిల్లులను క్లియర్ చేయని పక్షంలో మెడికల్ కాలేజీలకు ఎక్విప్మెంట్ సరఫరా చేసేది లేదని సర్కార్‌కు తేల్చిచెప్పాయి. అయినా స్పందన కరువైంది. వైద్య కళాశాలల్లో ఎక్విప్మెంట్కు సంబంధించి రూ.90 కోట్లను విడుదల చేస్తామని గతంలో సర్కార్ హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడంతో నార్త్ ఇండియాకు చెందిన 18 కంపెనీలు ఏకంగా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.