హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ఎంబీ దారి మళ్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని గురువారం ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు.
ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటును ఆలస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల అక్రమ తరలింపునకు సహకరిస్తున్నదని మండిపడ్డారు. జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం ఫస్ట్ ఫేజ్‌లో 18 చోట్ల, సెకండ్ ఫేజ్‌లో 9 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నదని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు అమలుకాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ పాలనలో సుప్రీంకోర్టులో కేసులు ఉన్నా 18చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశామని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం టెలిమెట్రీలను ఏర్పాటు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం తప్ప రెండేండ్లుగా చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఖల పేరిట కాలయాపన చేయకుండా కేఆర్ఎంబీపై ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన నిరుద్యోగ బిడ్డలపై కాంగ్రెస్ సర్కారు దమనకాండకు దిగడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్‌నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి, పొర్లు దండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు గద్దెనెక్కి పబ్బం గడుపుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. నాడు నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షను ఎన్నికల అస్త్రంగా మార్చుకొని ఇప్పుడు తెడ్డు చూపుతున్నారని దుయ్యబట్టారు. ఒడ్డు దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దాటాక బోడ మల్లన్న చందంగా అధికార పీఠమెక్కి నిరుద్యోగ బిడ్డల గొంతులపై ఉక్కుపాదం పెట్టి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరంకుశ పాలనతో నిరుద్యోగుల హక్కులను కాలరాస్తున్నదని విరుచుకుపడ్డారు.
రెండేండ్లలో 10వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం 60వేలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నదని హరీశ్‌రావు విమర్శించారు. ఓ వైపు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ఎక్కే విమానం.. దిగే విమానం చందంగా ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లలో చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం చేశారు. గ్రంథాలయాల్లో లాఠీచార్జీలు చేయించిన అరాచక చర్రిత కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు.
ఆంక్షలు పోలీసు కంచెలతో నిరుద్యోగుల ఆకాంక్షను దూరం చేయలేరని, వారి హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలను చల్లార్చలేరని స్పష్టంచేశారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ప్రతి నిరుద్యోగికీ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని తేల్చిచెప్పారు. లాఠీచార్జీ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని స్పష్టంచేశారు. వారికిచ్చిన హామీలు అమలయ్యేదాకా వెంటపడుతుందని స్పష్టంచేశారు.
కేఆర్ఎంబీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ టెలిమెట్రీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుంటే రేవంత్ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తున్నది. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన కేఆర్ఎంబీ.. రేవంత్ సర్కార్ అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని అన్యాయం చేస్తుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ మూడు ప్రభుత్వాలు కలిసి టెలిమెట్రీల ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాయి.
– హరీశ్‌రావు
కేసీఆర్ పాలనలో సుప్రీంకోర్టులో కేసులు ఉన్నా కృష్ణా జలాలకు సంబంధించి 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేశాం. కానీ ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం సబ్‌జ్యుడీస్ అని సాకులు చెప్పి తప్పించుకుంటున్నది. పోలవరం-నల్లమలసాగర్ విషయంలో మొద్దునిద్ర నటించినట్టే టెలిమెట్రీల ఏర్పాటు విషయంలోనూ కావాలనే అలక్ష్యం చేస్తున్నది. ఇప్పటికైనా కండ్లు తెరిచి రూ.4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగం పెంచాలి. లేఖలతో కాలయాపన చేయడం మాని కేఆర్ఎంబీపై ఫిర్యాదు చేయాలి.
– హరీశ్‌రావు
నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆశజూపిన కాంగ్రెస్.. ఇవాళ లాఠీచార్జీలు, అరెస్ట్‌లు, సంకెళ్లను బహుమతులుగా ఇస్తున్నది. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని తుంగలో తొక్కారు. భృతి ఇస్తామని నయవంచనకు గురిచేశారు. వెరసి నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశారు. మొన్న దిల్సుఖ్నగర్, నిన్న అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ బిడ్డలపై పోలీసులు క్రూరంగా దాడి చేయడం అమానుషం. గాయపడ్డ ప్రతి నిరుద్యోగికీ సీఎం రేవంత్ సమాధానం చెప్పాల్సిందే.
– హరీశ్‌రావు