ఒక పండ్ల చెట్టు ఉన్నది. దాని ఫలాలు తినాలంటే రోజూ దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్లు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తే.. ఏ బాధా ఉండదు! ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ విషయంలోనూ రేవంత్ సర్కారు ఇదే చేస్తున్నది!
గుండాల కృష్ణ –
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగినయి. దానికి మరమ్మతులు చేస్తే కిందకు పోతున్న ప్రాణహిత జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవచ్చు. యాసంగిలోనూ లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీళ్లివ్వచ్చు. అందుకే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయండి.. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి లక్షలాది ఎకరాల పంటలను కాపాడండి’ అని ఏడాదిన్నరగా బీఆర్ఎస్తో పాటు లక్షలాది మంది రైతులు డిమాండ్ చేస్తున్నరు. తాజాగా రేవంత్ సర్కారు ఆర్థిక సలహాదారు మోహన్ గురుస్వామి కూడా మేడిగడ్డను రిపేరు చేసి వాడుకోవాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
అసలు బరాజ్ ఉంటేనే కదా ఈ గోల. దాన్నే లేకుండా చేస్తే?! రిపేర్లు ఉండవు! డిమాండ్లు అసలే ఉండవు! మేడిగడ్డను రిపేరు చేస్తే రైతులకు సాగునీరు అంది కేసీఆర్‌కే పేరొస్తది! మరి నాకేంది?! అనుకుంటున్నట్టున్నది రేవంత్ సర్కారు! అందుకే చెట్టును కూకటి వేళ్లతో పీకేసేందుకే నిర్ణయించింది. నిన్నటికి నిన్న ఢిల్లీలో బనకచర్లపై సంతకం చేసి వచ్చిన రేవంత్‌రెడ్డి అదే సమయంలో కేంద్రానికి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి వచ్చారు. తెలంగాణ రైతులు ఎటన్న పోనీ.. ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ కట్టి ప్రాణహిత, ఇంద్రావతి జలాలను తమిళనాడులోని కావేరీకి తరలించుకుపోయేందుకు ఏకంగా గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదన ఇచ్చారు. కింద చంద్రబాబు బనకచర్లతో నీళ్లు మళ్లించుకుంటే, పైన ఇచ్చంపల్లి నుంచి కేంద్రం తమిళనాడుకు జలాలను తన్నుకుపోతుందన్నమాట.
ఇంతకీ.. తెలంగాణకు ఒరిగే ప్రయోజనమేమున్నది? అంటే ఏమీ లేదు.. కాకపోతే కేసీఆర్ మీద కక్షతో రేవంత్ సర్కారు ఆడుతున్న డేంజర్ గేమ్ ఇది! ఇదే అదునుగా ఓవైపు చంద్రబాబు బనకచర్లపై వేగంగా పావులు కదుపుతుంటే మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై రేపు హైదరాబాద్ జలసౌధలో కన్సల్టెన్సీ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఇక ఇచ్చంపల్లి డ్యామ్ పూర్తయితే తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసేందుకు కట్టిన మేడిగడ్డ బరాజ్ గోదావరి జలాల్లో మునిగిపోనున్నది. తద్వారా ఎగువన ఉన్న అన్నారం, సుందిల్ల బరాజ్‌లు సైతం కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. భారతదేశం.. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టుల్లో లోపాలు తలెత్తాయి. తదుపరి వాటికి మరమ్మతులు చేస్తే ఆ ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి రైతులకు సేవలందిస్తున్నాయి.
కానీ ఒక ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడమంటే ఆ ప్రాజెక్టును వినియోగించే ఉద్దేశం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే గత 20 నెలలుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతులను గోస పెడుతున్నది. దీంతో గత రెండు యాసంగి సీజన్లలో సాగునీరు అందక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది కూడా శ్రీరాంసాగర్‌కు మొన్నటిదాకా సరైన ఇన్‌ఫ్లో లేక ఏకంగా ఏడున్నర లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. కానీ కండ్ల ముందే వందల టీఎంసీల ప్రాణహిత జలాలు దిగువకు పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్ల కుంగుబాటును అడ్డం పెట్టుకొని గత 20 నెలలుగా రేవంత్ సర్కారు ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు. 2024 వేసవిలోనే బరాజ్ మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రావడంతో ప్రభుత్వం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను సాకుగా చూపింది. సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు తాము ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగానే వింటామని, తుది నివేదిక వచ్చిన తర్వాతే మరమ్మతులు చేపడతామని ప్రకటించారు.
తీరా ఎన్డీఎస్ఏ తుది నివేదిక రావడం, అదో డొల్ల నివేదిక కావడంతో ఏం చేయాలో ప్రభుత్వానికే పాలుపోవడం లేదు. అనంతరం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్యా నేతృత్వంలో కమిటీ వేసినట్టు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ అయిన దాఖలాల్లేవు. తదుపరి ఘోష్ నివేదిక అంటూ రాద్దాంతం చేసిన ప్రభుత్వం ఆ నివేదిక వచ్చిన తర్వాత రాజకీయ విమర్శలకే మొగ్గు చూపుతున్నది తప్ప బరాజ్ పునరుద్ధరణపై దృష్టిసారించడం లేదు.
గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? లేదా? అనేది శాస్త్రీయంగా తేలలేదు. రేవంత్ ప్రభుత్వ వాదన కూడా నిన్నటిదాకా ఇదే ఉన్నది. కానీ కొన్నిరోజులుగా ప్రభుత్వ వాదన మరోలా తయారైంది. బనకచర్ల ఎపిసోడ్ తెర మీదకు వచ్చిన తర్వాత కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చంపల్లి ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు. ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ నిర్మాణం చేపట్టి తమిళనాడులోని కావేరీకి అనుసంధానం చేసి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు తాము అంగీకరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు.
దీంతో ఇన్నాళ్లూ గోదావరి-కావేరీ అనుసంధానంపై అయోమయంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తన దూకుడు పెంచింది. వాస్తవానికి గోదావరిలో మిగులు జలాలను తేల్చిన తర్వాత కావేరీకి నీళ్లు తీసుకుపోవాలంటూ అడ్డు చెప్పాల్సిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చంపల్లి కోసం తహతహలాడటం వెనక మేడిగడ్డ బరాజ్‌ను కాలగర్భంలో కలపాలనే భారీ కుట్రనే ఉన్నదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారు. దాని దిగువన దేవాదుల ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వమే తుపాకులగూడెం వద్ద బరాజ్ నిర్మించింది. ఇప్పుడు కేంద్రం కావేరీకి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఈ రెండు బరాజ్‌ల మధ్యలో ఇచ్చంపల్లి దగ్గర డ్యామ్ నిర్మిస్తానంటుంది.
అక్కడి నుంచి 174 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు గతంలోనే డిటెయిల్డ్ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కూడా రాష్ర్టాలకు పంపింది. అయితే ఇక్కడ తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం గోదావరి జలాలను తన్నుకుపోవాలనేది మోదీ సర్కారు వ్యూహమైతే.. దీని వల్ల మేడిగడ్డ బరాజ్‌ను శాశ్వతంగా ముంచాలనేది రేవంత్ ప్రభుత్వం కుట్ర! అదెలాగో సాంకేతికంగా మీరే చూడండి..
ఇచ్చంపల్లి డ్యామ్ నిర్మాణంతో మేడిగడ్డ బరాజ్ శాశ్వతంగా నీటిపాలవుతుందనే నిపుణుల ఆందోళనను స్వయానా ఎన్డబ్ల్యూడీఏనే ధ్రువీకరించింది. వాస్తవానికి నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి ప్రతిపాదన తెరపైకి వచ్చినపుడు గోదావరిపై మేడిగడ్డ, సమ్మక్క బరాజ్‌ల నిర్మాణం జరగలేదు. కానీ ఇప్పుడు అవి ఉన్నాయి. ఈ క్రమంలో కనీసం తాజా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయకుండా ఎన్‌డబ్ల్యూడీఏ ఎడాపెడా ప్రతిపాదనలు రూపొందించింది.
దానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మద్దతు తెలపడంతో మేడిగడ్డను కాలగర్భంలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ టాస్క్‌ఫోర్స్ 19వ సర్వసభ్య సమావేశానికిగాను రూపొందించిన ఎజెండాలో ఇదే విషయాన్ని పొందుపరిచారు. రెండు పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ ఎలాగూ వినియోగంలోకి రానందున ఇచ్చంపల్లి డ్యాం నిర్మించి, ఇచ్చంపల్లి ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా పొందే ప్రయోజనాలను పొందాలని సూచించారంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే మేడిగడ్డను కాలగర్భంలో కలిపేస్తున్నాయనేది సుస్పష్టం.
గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా? నదుల అనుసంధానాన్ని భుజాన వేసుకున్న ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) దగ్గర ఈ క్షణం వరకు మిగులుజలాలపై శాస్త్రీయ లెక్కలు లేవు. అటు బనకచర్ల, ఇటు ఇచ్చంపల్లి ప్రతిపాదనలు వచ్చినప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లేవనెత్తాల్సిన కీలకమైన ప్రశ్న ఇది. కానీ అవేవీ చేయకుండా రెండు ప్రాజెక్టులకు సానుకూలంగా స్పందిస్తుండటంతో తెలంగాణ సాగు రంగానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే గోదావరిలో బాబ్లీ కుంపటి సెగను తెలంగాణ అనుభవిస్తున్నది.
ఉమ్మడి ఏపీ లో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందంలో గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల మహారాష్ట్ర శ్రీరాంసాగర్ ఎఫ్ఆర్ఎల్ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు ను నిర్మించడంతో మహారాష్ట్ర దయ తలిస్తే దిగువకు వరద వచ్చే పరిస్థితి ఏర్పడింది. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే… ప్రతియేటా జూన్ ఒకటో తేదీన బాబ్లీ గేట్లు తెరిచి, అక్టోబర్ 29న మూసేస్తున్నారు. ఆలోపు వచ్చే వరద మాత్రమే తెలంగాణకు దక్కుతుంది. ఇదేరీతిన ఇచ్చంపల్లి దగ్గర జాతీయ ప్రాజెక్టు అయిన గోదావరి-కావేరీ లింక్ ప్రాజెక్టును నిర్మిస్తే బేసిన్‌తో ఎలాంటి సంబంధం లేని తమిళనాడు గోదావరిలో భాగస్వామ్యం అవుతుంది.
తాగునీరు, కరువు అంటూ మెలిక పెట్టి ఆ రాష్ట్రం భవిష్యత్తులో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ఇచ్చంపల్లి ప్రాజెక్టు తెలంగాణకు మరో బాబ్లీలా తయారవుతుంది. ఓవైపు మేడిగడ్డ గోదావరిపాలై నీటిని ఎత్తిపోసుకునే పరిస్థితి ఉండదు. వరద వచ్చే రోజులు మినహా సాధారణ ఇన్‌ఫ్లో ఉండే సమయంలో దిగువకు చుక్క నీరు కూడా వెళ్లకుండా తమిళనాడు న్యాయస్థానాల నుంచి భరోసా పొందితే దిగువన ఉన్న తెలంగాణలోని దేవాదుల, సీతారామ, దుమ్ముగూడెం ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.