ఏడాదిలో కాదు.. ఐదేండ్లలో
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే విధంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం విమర్శలకు దారితీస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేతులెత్తేస్తున్నది. హామీల ఎగవేత పరంపరంలో ఈ సారి మరో హామీ చేరింది.
- రెండు లక్షల ఉద్యోగాల భర్తీ
- మరో హామీపై నాలుక మడతేసిన కాంగ్రెస్
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ అసంబద్ధ వ్యాఖ్యలు
- ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తమని మేం చెప్పలే
- ఐదేండ్ల పదవీకాలంలో ఇస్తామని చెప్పాం
- మహేశ్ వ్యాఖ్యలతో ఉద్యోగాలు ఇక కలేనా?
- ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని నాడు
- ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చిన కాంగ్రెస్
- ఎన్నికల ప్రచార సభల్లోనూ రేవంత్‌రెడ్డి హామీ
- ఉద్యోగాల భర్తీపై ప్రియాంకగాంధీ సైతం భరోసా
- ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి.. నిరుద్యోగ
- యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
- రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న నిరుద్యోగ యువత
2024లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ఏటా జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఖాళీల వివరాలు సేకరించి.. నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17న నియామక పత్రాలు అందిస్తం.
-పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్.
నిరుద్యోగ యువతకు నేను భరోసా ఇస్తున్నా.. సంవత్సరం తిరిగే లోపు 2 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే బాధ్యత మాది.
– 2024 జనవరి 31న రేవంత్
మేం ప్రధాని మోదీ మాటల్లాగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలని చెప్పలేదు. మా టర్మ్ (ఐదేండ్ల)లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే చెప్పినం. మళ్లీ ఎన్నికైతే మళ్లీ 2 లక్షల ఉద్యోగాలిస్తం. ఇది నిరంతర ప్రక్రియ.
– జనవరి 31న మహేశ్ గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే విధంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం విమర్శలకు దారితీస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేతులెత్తేస్తున్నది. హామీల ఎగవేత పరంపరంలో ఈ సారి మరో హామీ చేరింది. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులకే ఏకంగా కుచ్చుటోపీ పెట్టింది.
తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీపై కొత్త పల్లవి ఎత్తుకున్నది. ఆ హామీనే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేస్తున్నది. ఉద్యోగాలు భర్తీ చేయలేని కాంగ్రెస్ సర్కార్.. అసలు ఆ హామీనే ఇవ్వలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీపై అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వలేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాన్ని అందంగా చెప్పేశారు. ఈ మేరకు తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్యోగాల భర్తీపై పచ్చి అబద్ధాలను చెప్పుకొచ్చారు.
ఏడాదిలో కాదు.. ఐదేండ్లలో..
టీపీసీసీ అధ్యక్షుడైన మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ పార్టీ ఇచ్చిన ‘ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ’పై అత్యంత సులువుగా అబద్ధాన్ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ, ఆనాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారనే సోయి లేకుండా, తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఆ హామీ ఇచ్చిందనే కనీస ఆలోచన లేకుండా ఆయన నాలుక మడతేశారు.
ఇవన్నీ మర్చిపోయిన పీసీసీ చీఫ్ వితండ వాదన ఎత్తుకున్నారు. అసలు తాము ఎప్పుడూ, ఎక్కడ కూడా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వలేదంటూ పచ్చి అబద్ధాలను చెప్పారు. తమ టర్మ్‌లో(ఐదేండ్లలో) 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినట్టు సెలవిచ్చారు. మరో టర్మ్ ఎన్నికైతే మరో 2 లక్షలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. మోదీ మాటల్లాగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలని మేం చెప్పలేదు. మా టర్మ్‌లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పలేదు. మళ్లీ ఎన్నికైతే మళ్లీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ’ అంటూ నిరుద్యోగులను ముంచే వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగులను నిండా ముంచే కుట్ర!
ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా వారిని నిండా ముంచే కుట్రలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయింది. ఈ కాలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో సర్కార్ ఘోరంగా విఫలమైంది. పేరుకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్నది. కానీ ఇందులో మెజారిటీ ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు జారీచేసి, రాత పరీక్షలు పూర్తిచేసింది. ఈ సర్కారు వచ్చి వారికి నియామక పత్రాలు అందించి ఆ ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటున్నది. ఈ సర్కార్ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీచేసిన ఉద్యోగాల సంఖ్య 8వేలు దాటదు. బీఆర్ఎస్ హయాంలో రాత పరీక్ష, ఎంపిక పూర్తిచేసిన 50,127 పోస్టులకు ఈ సర్కార్ నియామక పత్రాలు ఇచ్చింది.
సర్కార్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’
ఇటీవల ఉద్యోగాల భర్తీ కోరుతూ సిటీ సెంట్రల్ లైబ్రరీలో, అశోక్‌నగర్‌లో ధర్నా చేస్తున్న నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పాశవికంగా లాఠీచార్జీ చేయించింది. ఓవైపు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, తమపైనే దాడుల చేస్తున్న కాంగ్రెస్‌పై నిరుద్యోగులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలు డైవర్షన్ పాలిట్రిక్స్‌కు తెరలేపారు. ‘ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండేండ్లయినా భర్తీ చేయలేదు’ అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తుంటే.. అసలు తాము ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీనే ఇవ్వలేదంటూ నిరుద్యోగులకు ధోకా ఇచ్చే ఎజెండా ఎత్తుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిండాముంచే కుట్రలకు తెరలేపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మహేశ్‌కుమార్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నిరుద్యోగులు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత భగ్గుమంటున్నది. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనలేదని, ఐదేండ్లలో ఇస్తామన్నామనడంపై రగిలిపోతున్నారు. పుండుమీద కారం చల్లిన చందంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ మోసంపై మండిపడుతున్న నిరుద్యోగులు పోరుబాటలో కొనసాగుతున్నారు. మరి నాడు ఎన్నికల ముందు తెలంగాణ నిరుద్యోగ యువతకు ప్రియాంకగాంధీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల సంగతేమిటి? మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మాటేమిటి? అనే ప్రశ్నలను మహేశ్‌కుమార్ గౌడ్‌కు నిరుద్యోగ యువత సంధిస్తున్నది. ఏ పార్టీనైతే భుజాన వేసుకొని అధికారంలోకి తీసుకొచ్చారో? ఇప్పుడు అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తమను నిండా ముంచిందని, హామీ ఇచ్చి మోసం చేసిందంటూ నిరుద్యోగ యువత రగిలిపోతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

