హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనలో చాలాశాఖల్లో పనులు పడకేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణాళికలు, కార్యాచరణ, పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడిక్కడ నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నదని అధికారులే వాపోతున్నారు. రాష్ట్ర సాగు నీటిపారుదలశాఖపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇందుకు ఓ ఉదాహరణ అని చెబుతున్నారు. ఈ శాఖలో ఇన్చార్జీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. కీలక పోస్టులన్నీ ఖాళీ అయినా ప్రభుత్వం పూర్తికాలపు అధికారులను నియమించలేదు. ఇంజినీర్లకు అదనపు బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకోవడం వల్ల పాలన గాడితప్పిందని సీనియర్ అధికారులే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇరిగేషన్శాఖకు మొత్తం 23 చీఫ్ ఇంజినీర్ పోస్టులు ఉండగా అందులో 15మంది సీఈలు విరమణ పొందారు. ఈఎన్సీ జనరల్, ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈతో పాటు మరో 11 మంది సీఈలు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో ఇతర సీఈలు, ఎస్ఈలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అలాగే 35మంది సూపరింటెండెంట్ ఇంజినీర్లు, 18మంది డీఈఈలు, పదుల సంఖ్యలో దాదాపు 70 మంది వరకు ఈఈలు పదవీ విరమణ పొందారు. వారి స్థానంలో ప్రభుత్వం పూర్తిస్థాయి అధికారులను నియమించకుండా ఇన్చార్జీలకు బాధ్యతలను అప్పగించింది. దీంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేదని, సరైన వివరాలు అందడం లేదని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్ విభాగంలో 360, ఇతర విభాగాల్లో 586 పోస్టులు 945 ఖాళీలు ఉన్నాయి. త్వరలోనే పూర్తిస్థాయిలో అధికారులను నియమిస్తామని ప్రభుత్వం 6 నెలలుగా చెబుతున్నప్పటికీ హామీ ఆచరణకు నోచుకోవడం లేదు. అటు అడ్హాక్ ప్రమోషన్లు ఇవ్వకుండా, ఇటు రెగ్యులర్ ప్రమోషన్ల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.