హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండేండ్ల పాలనతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రతి వర్గం నుంచి విమర్శలు వ్య క్తమవుతున్నాయి. హామీలు అటకెక్కిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. విసిగివేసారిన జనం ప్రభుత్వంపై నిరసన గళాలు వినిపిస్తున్నారు. ఈ జాబితాలో మేడ్చల్ ప్రజానీకం కూడా చేరారు. హైదరాబాద్ మెట్రో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం నడుం బిగించారు. శంకుస్థాపన చేసి, ఏడాదిన్నర గడిచినా తట్టెడు మట్టి తొలగించలేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, కేంద్రం అలసత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇరు ప్రభుత్వాల నేతలు పరస్పరం బురదజల్లుకుంటూ పబ్బం గడుపుతున్నారని మేడ్చల్ మెట్రో సాధన సమితి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మెట్రోపై కాంగ్రెస్ చెప్తున్న హామీలు, దాటవేత ధోరణులతో ప్రజలు నమ్మకం కోల్పోయారని మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు భూసేకరణ కూడా చేయలేదని చెప్పారు. నమ్మకం కోల్పోయిన ప్రజల ద్వారానే మళ్లీ శంకుస్థాపన చేయిస్తామని చెప్పారు. 14న సుచిత్ర నుంచి జీడిమెట్ల వరకు, 21న జీడిమెట్ల గాంధీ విగ్రహం నుంచి జేబీఎస్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. జనవరి 1న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, ప్రభుత్వ తీరును ఎండగడుతామని వివరించారు.