హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) రోడ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా? అంటే అధికార వర్గాలు, వర్క్ ఏజెన్సీల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ‘ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం బ్యాంకులకు గ్యారెంటీ ఇద్దామన్నా ఇప్పటికే ప్రభుత్వం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్రెడ్డి సర్కార్ పరిస్థితి చూసి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడంలేదు’ అని వారు చెప్తున్నారు.
ప్రభుత్వం తమ చేతినుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం భారాన్ని కాంట్రాక్టర్లు, బ్యాంకర్లపై మోపేందుకు హ్యామ్ ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. ఈ ప్రాజెక్టు కింద తొలి దశలో రూ.11,399 కోట్లతో 5,824 కి.మీ. మేర ఆర్అండ్బీ రోడ్లతోపాటు రూ.6,294 కోట్లతో 7,449 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ఏడాది చివర్లో ప్రభుత్వం ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్)లను ఆహ్వానించింది. కానీ, దీనికి కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. హ్యామ్ విధానంలో భాగంగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 40% మొత్తాన్ని ప్రభుత్వం, మిగిలిన 60% మొత్తాన్ని కాంట్రాక్టర్లు బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉన్నది.
కాంట్రాక్టర్లు తీసుకునే రుణాలకు గ్యారెంటీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ప్రభుత్వాన్ని నమ్మి తాము పెట్టుబడి పెడితే నట్టేట మునగడం ఖాయమని కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇస్తామంటున్న గ్యారెంటీని బ్యాంకర్లు సైతం సీరియస్గా తీసుకోవడం లేదు. దీంతో దాదాపు ఏడాదిన్నరపాటు తీవ్ర కసరత్తు చేసి రూపొందించిన హ్యామ్ ప్రాజెక్టుపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది.
కాంట్రాక్టర్లకు భరోసా ఏదీ?
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనపై భారం పడకుండా చూసుకునేందుకు హ్యామ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో గ్రామాలు, మండల కేంద్రాల మధ్య ఉన్న మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు మధ్య ఉన్న సింగిల్ లేన్ రోడ్లను డబుల్ లేన్ రోడ్లుగా మార్చాలని, జిల్లా కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులను మరింత విస్తరించాలని నిర్ణయించింది. కానీ, బ్యాంకులు, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రేవంత్రెడ్డి సర్కార్కు చుక్కెదురైంది. యూపీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్), బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానాలను కలగలిపి హైబ్రిడ్ విధానంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నాయి. దీనిలో భాగంగా బ్యాంకుల నుంచి రుణాలు సమకూర్చుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఆయా ప్రభుత్వాలు చెల్లింపులు జరుపుతున్నాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చేసిన పనులకు తప్పకుండా బిల్లులు వస్తాయని కాంట్రాక్టర్లకు రేవంత్రెడ్డి సర్కార్ భరోసా కల్పించకపోవడంతో హ్యామ్ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
హ్యామ్ స్వరూపాన్నే మార్చేసిన కాంగ్రెస్ సర్కార్
హ్యామ్ విధానంలో కాంట్రాక్టర్లు ముందు డబ్బు ఖర్చుచేసి రోడ్డు నిర్మించిన తర్వాత టోల్ ట్యాక్స్ ద్వారా ఆ నిధులను రాబట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, రేవంత్రెడ్డి సర్కారు ఈ ప్రాజెక్టు స్వరూపాన్నే మార్చేసింది. టోల్ ట్యాక్స్ ద్వారా నిధులు సమకూర్చుకునే వీలుంటేనే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారని, కానీ గ్రామీణ, జిల్లా రోడ్లపై టోల్ వసూలు చేసేందుకు వీల్లేకపోవడంతో రాష్ట్రంలో హ్యామ్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదని అధికారులు చెప్తున్నారు.