Paddy Procurement | కోడేరు, మే 25 : నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులైనా లారీలు రావడం లేదనే సాకుతో కాంటా వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాసంగి సీజన్లో ప్రభుత్వం కోడేరు మండలంలో 12ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఏ ఒక్క కేంద్రంలోనూ కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు రోజుల తరబడి అక్కడే పడిగాపులుకాస్తున్నారు. కోడేరు, జనుంపల్లి, తీగలపల్లి, పసుపుల, బావాయిపల్లి, కొండ్రావుపల్లి, ఎత్తం, నర్సాయపల్లి, మైలారం, నాగులపల్లి, రాజాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే అక్కడ సరిపడా గన్నీ బ్యాగులు లేవని, కొనుగోలు చేసిన ధాన్యం లోడింగ్ కోసం లారీలు రావడం లేదని నిర్వాహకులు సాకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పక్షపాతం చూపిస్తూ.. నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉన్న వారి ధాన్యం ముందుగా కాంటా వేసి.. మిగతా వారిని పట్టించుకోవడం లేదని, పైగా తేమశాతం పేరుతో సాకులు చెప్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.