హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు బడికి అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఈ రెండేండ్ల కాలంలో రాష్ట్రంలో ఐదు లక్షల మంది విద్యార్థులు సర్కారు బడుల నుంచి నిష్క్రమించారు. ఈ ఐదు లక్షల మంది సర్కారు బడులు వదిలి.. ప్రైవేట్ బడుల్లో చేరారు. 2022లో సర్కారు బడుల్లో 30.09లక్షల మంది విద్యార్థులుండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023-24 విద్యాసంవత్సరంలో ఈ ఎన్రోల్మెంట్ 27.79 లక్షలకు పడిపోయింది. ఇక 2024-25కు వచ్చేసరికి 24.96 లక్షలకు పడిపోయింది.
ఈ రెండేండ్ల కాలంలో ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. విద్యాశాఖను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డియే పర్యవేక్షిస్తున్నారు. అయినా ఏమాత్రం మార్పురాకపోగా, సర్కారు బడులు మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. ఆందోళన కలిగించే విషయమేంటంటే సర్కారు బడుల్లో తగ్గి.. ప్రైవేట్ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరగడం గమనార్హం. మొత్తం 30,137 ప్రభుత్వ బడులుండగా, 11,217 ప్రైవేట్ స్కూళ్లున్నాయి. మేనేజ్మెంట్వారీగా తీసుకుంటే సర్కారులోనే అత్యధికంగా బడులున్నాయి. ప్రైవేట్‌తో పోల్చితే రెండు రెట్లు అధికంగా సర్కారు బడులున్నాయి. కానీ వీటిల్లో ఎన్రోల్మెంట్ మాత్రం నిరాశజనకంగా ఉంది.
రేవంత్‌రెడ్డి పాలనలో సర్కారు బడులు నేలచూపులు చూస్తుంటే.. కేసీఆర్ పాలనలో స్వర్ణయుగాన్ని చూశాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ ఐదు లక్షలు పెరిగింది. సాక్షాత్తు ఇదే విషయాన్ని కేంద్రం తాజాగా పార్లమెంట్లో వెల్లడించింది. 2019 నుంచి 22 మధ్య కాలంలో సర్కారు బడుల్లో 4.66లక్షల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందినట్టు కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. కాంగ్రెస్ పాలనలో సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గడంపై మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా నేత మన్నె క్రిశాంత్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్రోల్మెం ట్ తగ్గుతున్న రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా..? అంటూ ఎక్స్‌లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.