హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్ నుంచి వై జంక్షన్ కూడలి వరకు చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, అదే స్కీమ్‌కు తూట్లు పొడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యా రంగ సమస్యలపై సమీక్షించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దసరాలోపు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.