Crop Insurance | హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు మరో పథకంపై మాటమార్చేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చిన మరో హామీపై మడమ తిప్పనున్నది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉన్నది. ప్రీమియం సొమ్మును రైతుల నుంచే వసూలు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. పంటల బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయనున్నట్టు నిరుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతుల ప్రీమియం వాటాను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆనాడే ప్రకటించారు.
ఇందుకోసం ఏటా సుమారు రూ.1,500 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కూడా సర్కారు లెక్కలేసింది. ఏం జరిగిందో ఏమో గానీ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చినట్టుగా తెలుస్తున్నది. ప్రీమియం వాటాను రైతులే చెల్లించేలా నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రైతులు తమ వాటా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాట ఇవ్వడం, తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాటుగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంటల బీమా పథకం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 23న పంటల బీమాపై సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల.. మళ్లీ విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. దీంతో పంటల బీమా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫసల్ బీమా పథకాన్ని ఇతర రాష్ర్టాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయనం చేయాలని, కంపెనీలు సత్వరమే పరిహారం చెల్లించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలించాలని ఆదేశించారు. దీంతోపాటు అన్నిరకాల ప్రధాన పంటలకు బీమా అమలు చేస్తే ప్రభుత్వంపై పడే భారాన్ని కూడా లెక్కించాలని ఆదేశించారు. వాస్తవానికి వీటన్నింటిపై గతంలోనే కసరత్తు మొత్తం పూర్తిచేశారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ఆదేశాలు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో రైతుల కోసం మళ్లీ పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. ఈ మేరకే కేంద్ర పథకమైన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరింది. దీంతో 2023-24 యాసంగి సీజన్ నుంచే పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు కూడా చేపట్టింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు నిబంధనలు కూడా రూపొందించారు. ఒక దశలో టెండర్ల వరకు కూడా వెళ్లింది. కానీ తెరవెనుక ఏం జరిగిందో గానీ, పంటల బీమాకు అక్కడితో బ్రేక్‌పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో టెండర్లను అటకెక్కించింది. ఎన్నికల తర్వాత వానకాలంలో, గత యాసంగిలోనూ అమలు చేయలేదు. ఇలా మూడు సీజన్ల నుంచి పంటల బీమా పథకం అమలుపై సర్కార్ నాన్చుతూ వస్తున్నది.