Makthal Court | మహబూబ్‌నగర్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో కొలువుదీరిన కోర్టు కథ ఇది. స్వయానా సీఎం ఇలాకా. అందునా పశుసంవర్ధక, క్రీడాశాఖ మంత్రి నియోజకవర్గం. అయినా బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయలేని దయనీయం., నిధుల కేటాయింపులు లేక అటకెక్కించిన దుస్థితి. కాంగ్రెస్ సర్కార్ కొత్త సౌకర్యాల కల్పించడం ఏమోగానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులనే పూర్తి చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నదని విమర్శలు. అందుకు ఉదాహరణే నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో కొలువుదీరిన కోర్టు కథ.
ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటిన్నర వెచ్చించి కార్యాలయాలు కట్టించింది. కాగా, 2009 లో నియోజకవర్గ కేంద్రాలు మారడంతో అప్పటి వరకు కలిసున్న మక్తల్, నారాయణపేట విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్‌లో కొత్త కోర్టు నిర్మాణం కోసం హైకోర్టును అభ్యర్థించి స్థలాన్ని కూడా సేకరించారు. భవనం నిర్మాణం కోసం అంచనాలు తయారు చేసి తాత్కాలిక భవనాన్ని కూడా సిద్ధం చేయించారు. సరిగ్గా అదే సమయంలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి.
ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా నియోజకవర్గ కేంద్రంలో కోర్టు భవనానికి కావాల్సిన నిధులు సమీకరించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ క్రమంలోనే కోర్టుకు పక్కా భవనం లేకపోతే రద్దు చేస్తామనే హెచ్చరికలు రావడంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ను మంత్రి కోర్టు కార్యకలాపాలకు కేటాయించారు.
ఎమ్మెల్యేలకు ఉపయోగపడాల్సిన కార్యాలయాన్ని నిధులు లేక కోర్టుకు అప్పగించిన తీరును తప్పుబడుతూ ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హడావిడిగా ప్రారంభోత్సవం చేయడంపై మండిపడుతున్నారు. కాగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం కోర్టు భవనాన్ని కూడా పూర్తి చేయలేని దుస్థితిలో ఉండడం ఒకెత్తు అయితే, స్వయానా సీఎం ఇలాకా, ఓ మంత్రి నియోజకవర్గంలోనే ఇంతటి దయనీయస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.