Congress Govt | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకు సర్కారు సున్నం పెడుతున్నది. ఒకవైపు, సన్న ధాన్యం కొనుగోళ్లలో అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొనుగోలు చేసిన సన్నాలకు సైతం ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదు. క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు నయా పైసా చెల్లించలేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు 1.29 లక్షల మంది రైతుల నుంచి 10.32 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి రైతులకు బోనస్ కింద రూ.515.82 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ధాన్యం విక్రయించిన రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో పైసలు జమ చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు సన్నాలు విక్రయించి నెల గడుస్తున్నా, బోనస్ పైసలు వారి ఖాతాల్లో జమ కాలేదు. అసలు ప్రభుత్వం బోనస్ ఇస్తుందా? లేదా? అనే అనుమానాలను రైతులు వ్యక్తంచేస్తున్నారు. అనవసరంగా సర్కారు మాటలు నమ్మి సన్నాలు సాగుచేశామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత వానకాలం సీజన్లోనూ ధాన్యం విక్రయించిన మూడు నెలలకు గానీ బోనస్ చెల్లించలేదు. ఈ సీజన్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని, అందులోభాగంగానే కొనుగోలు కేంద్రాల్లో అధికారులు వివిధ రకాల కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సన్నాల జాబితాలో ఉన్న రకాలకు సైతం కొలతలు వేసి అవి సన్నాలు కాదని చెప్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 10.32 లక్షల టన్నుల సన్నాలు, 14.11 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయి. వాస్తవానికి, ఈ సీజన్లో కనీసం 30 లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, వివిధ కొర్రీలు పెడుతూ అధికారులు సన్నాలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సన్న ధాన్యం కొనుగోళ్లలో సర్కారు కొర్రీలకు తోడు మిల్లర్ల సతాయింపులు తోడయ్యాయి. నానా తంటాలు పడి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయిస్తే, మిల్లుకు చేరాక మళ్లీ ఇబ్బందులు మొదలవుతున్నాయి. సన్నాలను తాము దించుకోబోమంటూ మిల్లర్లు తెగేసి చెప్తున్నారు. యాసంగిలో సన్నాలు దించుకుంటే తాము నష్టపోతామని, కాబట్టి క్వింటాల్‌కు 5-10 కేజీలు కోత విధిస్తామని, అందుకు అంగీకరిస్తేనే ధాన్యం దించుకుంటామని మిల్లర్లు చెప్తున్నారు. అందుకు రైతులు ఒప్పుకోకపోతే, ‘మీ ధాన్యం మీరు తీసుకెళ్లండి.. మేం దించుకోం’ అని మిల్లర్లు తెగేసి చెప్తున్నట్టు తెలిసింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
సన్న ధాన్యం కొనుగోళ్లలో సర్కారు, మిల్లర్లు కలిసి దొంగాట ఆడుతున్నారని, ఇద్దరూ కలిసి రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగిలో సన్నాలను మరాడిస్తే నిబంధనల ప్రకారం అవుట్‌టర్న్ రేషియో బియ్యం 67 కేజీలు రావని, అందుకే తాము సన్న ధాన్యం దించుకోబోమని మిల్లర్లు ముందే చెప్పారు. అయితే, పౌరసరఫరాల సంస్థ మాత్రం సన్న ధాన్యం దించుకోవాల్సిందేనని మిల్లర్లను బెదిరిస్తున్నట్టు తెలిసింది. దీంతో మిల్లర్లు పైకి సరే అని ఒప్పుకొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం దించుకునేందుకు నిరాకరిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకవైపు ఎడాపెడా కోతలు పెడుతున్నా, ధాన్యం దించుకునేందుకు నిరాకరిస్తున్నా మిల్లర్లపై కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. మొత్తానికి మిల్లర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు అనుసరిస్తున్న వైఖరి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.