Kaleshwaram | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా మూ డేండ్లు ఉన్న నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జేబు సంస్థగా మారిన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు ఆ నిషేధాన్ని కొనసాగించింది. కానీ.. కేసీఆర్‌పై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ ఉత్తర్వులను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసమంటూ రెడ్‌కార్పెట్ పరిచి మరీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఆహ్వానించారు. కేవలం ఈ ఒక్క కేసు దర్యాప్తునకు మాత్రమే సీబీఐకి ద్వారాలు తెరిచారు. ఈ మేరకు రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ గతంలో జారీచేసిన జీవో 51ని సవరించి.. జీవో 104 ద్వారా సీబీఐకి సాధారణ అనుమతి ఇచ్చారు. ప్రాజెక్టుపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదివారం అర్ధరాత్రి ప్రకటించిన ప్రభుత్వం తెల్లవారేసరికి శాసనసభ ప్రతిపాదనను సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు పంపింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు స్వీకరించడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కక్ష సాధించేందుకే
సీబీఐ, ఈడీ, ఈసీ వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ తన జేబు సంస్థలుగా మార్చిందని, వాటిని ఉసిగొల్పుతూ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ కొన్నేండ్లుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి సైతం నాలుగు రోజుల కిందటి వరకు ఇదే పాట పాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పలు రాష్ర్టాల్లో సీబీఐకి ప్రవేశం లేకుండా ఇప్పటికీ నిషేధం కొనసాగుతున్నది. ఇప్పుడు కాళేశ్వరం కేసులో మాత్రం ప్లేటు ఫిరాయించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నంత కాలం తమ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని పావుగా వాడుకున్నదన్న విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆ తరువాత బీజేపీ సైతం అదే ఒరవడిని మరింత ఉధృతంగా కొనసాగించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సహా పలు రాష్ర్టాలు సీబీఐ ప్రవేశాన్ని నిషేధిస్తూ జీవోలు విడుదల చేశాయి. తాజాగా కేవలం తమ రాజకీయ లక్ష్యం కోసమే కాంగ్రెస్ సీబీఐ విషయంలో తన వైఖరిని మార్చుకున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం కేసీఆర్‌పై సీబీఐని ఉసిగొల్పి, ఆయనపై కక్ష సాధించేందుకే రేవంత్ సర్కారు ఈ ఒక్క కేసు కోసమే కేంద్ర సంస్థకు ద్వారాలు తెరిచిందని భావిస్తున్నారు.
వారి బంధం బయటపడ్డట్టే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఆసక్తి ఉంటేనే సీబీఐ కేసులు ముందుకు కదులుతాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. ఇందుకు ఏపీ ఘటనను ఉదాహరణగా పేర్కొంటున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు అవకతవకలకు పాల్పడ్డారని, సీబీఐ దర్యాప్తు జరపాలని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా సీబీఐ స్పందించలేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు సైతం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్డీఎస్ఏ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడుతున్నా, బీజేపీ పెద్దల ప్రోద్బలం అవసరమని చెప్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణ, అజమాయిషీ కిందనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, సీబీఐ దర్యాప్తు జరపాలంటే ముందుగా వారినే విచారించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నేరు గా దర్యాఫ్తు చేసే అధికారం సీబీఐకి లేదని, దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్-6 కింద నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం సెక్షన్-5 కింద అనుమతించాల్సి ఉంటుందని సదరు సీనియర్ అధికారి వివరించారు. ఈ రెండు జరగాలంటే ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పారు. అదే జరిగితే రేవంత్‌రెడ్డి, మోదీకి మధ్య ఉన్న బంధం బయటపడుతుందని విశ్లేషించారు.
తనను నమ్మడం లేదనే సీబీఐకి..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత గొంతు చించుకొని ప్రచారం చేస్తున్నా, కమిషన్లు వేసినా ప్రజలు నమ్మడం లేదని సీఎం రేవంత్‌రెడ్డికి అర్థమైందని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు అభిప్రాయపడుతున్నారు. ఫలితం విరుద్ధంగా వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం తకువగా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో సీబీఐ దర్యాప్తు అంటే సుదీర్ఘకాలం సాగుతుంది. అనేక కేసుల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ కేసులోనూ సీబీఐ దర్యాప్తులో ఆలస్యం జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేయడానికి ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారట. అందుకోసమే తన చేతికి మట్టి అంటకుండా సీబీఐ పావును కదిపారని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ చేసే విమర్శలను, సీబీఐ దర్యాప్తును ప్రజలు నమ్ముతారా? లేదా అనేదే ముఖ్యమని ఓ అధికారి పేర్కొన్నారు.