హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణలో నదీజలాలపై అవగాహన లేదని తేలిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అసెంబ్లీలో చర్చను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు, తెలంగాణవాదులు, సామాజికమాధ్యమాల ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మంత్రుల అజ్ఞానం బయటపడిందని చెప్తున్నారు. నదీజలాలు, బరాజ్‌ల భౌగోళిక పరిస్థితులు, దూరం వంటి బేసిక్స్ కూడా తెలియదనే విషయం మంత్రులే బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో తెలియని సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌లో సమఉజ్జీలైన మంత్రులే ఉన్నారంటూ సెటైర్లు పేలాయి.
బుకాయింపు… దబాయింపు!
సీఎం, మంత్రులుగా కీలక స్థానాల్లో ఉన్న నేతలు… బేసిక్ డీటెయిల్స్ కూడా ప్రిపేర్ కాకుండా సభకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అధికారుల ద్వారా వివరాలు సేకరించుకుని, కసరత్తు చేయాల్సిన మంత్రులు.. సభకు వచ్చి… చిన్నచిన్న వివరాలు కూడా ప్రతిపక్షాన్ని అడిగి తెలుసుకున్నారని మండిపడుతున్నారు. అదికూడా నిలదీసే ధోరణిలో దబాయించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదాహరణకు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుందన్న మంత్రి జూపల్లి వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హాస్యాస్పదంగా మారాయి. మేడిగడ్డ బరాజ్ ఎక్కడ ఉందో కూడా తెలియని మంత్రులు… అది కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేయడందారుణమని పలువురు మండిపడుతున్నారు. ఎక్కడ ఎంత మొత్తం నీటి లభ్యత ఉందో కూడా మంత్రులకు అవగాహన లేదా? ఈ తెలివితేటలతో తెలంగాణ రైతులకు నీళ్లందిస్తారా? ఏపీ జలదోపిడీని అడ్డుకుంటారా? అంటూ తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
మంత్రుల తిప్పలు.. హరీశ్ నోటిలెక్కలు
ఆదివారం అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా తొలుత ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. తమ్మిడిహట్టి వద్ద నీటిలభ్యత ఉన్నా కూడా బీఆర్ఎస్ పాలకులు.. ప్రాజెక్టును అక్కడ కట్టలేదని, మేడిగడ్డకు మార్చారని చెప్పుకొచ్చారు. సీడబ్ల్యూసీ, అప్పటి కేంద్రమంత్రి ఉమాభారతి రాసిన లేఖలను అరకొరగా చదివారు. ఇదంతా కూడా బీఆర్ఎస్, కేసీఆర్‌పై బురద చల్లేందుకు చేసిన ప్రయత్నంగానే సాగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అధికారనేతల ప్రచారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు దీటుగా తిప్పికొట్టారని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మంత్రులు కొన్ని లేఖలను చూపుతూ మాట్లాడినా వాటిలోని అంశాలను పూర్తిగా చదవకుండా సభను, తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించారని, ఈ ప్రయత్నం బెడిసికొట్టిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టిన ఘోష్ కమిషన్ నివేదికలోని విషయాలను హరీశ్‌రావు చదివి వినిపించడం ద్వారా ప్రజలకు నిజాలు తెలియజేసి, పైచేయి సాధించారని విశ్లేషిస్తున్నారు. మంత్రులు బేసిక్స్ కూడా తెలియకుండా తిప్పలు పడుతుంటే.. హరీశ్‌రావు నోటిలెక్కలు చెప్తూ, కాంగ్రెస్ కుట్రలను చీల్చి చెండాడారని అభినందిస్తున్నారు.
మంత్రులు.. ఒకరిని మించి మరొకరు!
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును సమైక్య కాంగ్రెస్ సర్కారు ఎంత గుడ్డిగా ప్రతిపాదించిందో హరీశ్‌రావు వివరించిన తీరు అద్భుతంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అలాగే, హరీశ్‌రావు మంత్రులను కూర్చోబెట్టి క్లాస్ చెప్పినట్టుగా సభ సాగిందని అభివర్ణిస్తున్నారు. హరీశ్‌రావు మాట్లాడుతున్నప్పుడు ఓ దశలో జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఏకంగా నీటిలభ్యత అంశంపై మహారాష్ట్రతో చర్చలే జరగలేదని అన్నారు. ముంపుపై మాత్రమే చర్చ జరిగిందంటూ చెప్పుకొచ్చారు. హరీశ్ తిప్పికొట్టారు.
జూపల్లి ‘సింపుల్ క్వశ్చన్’పై సెటైర్లు
మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ‘సింపుల్ క్వశ్చన్’ అనుకుంటూ తమ్మిడిహట్టి వద్ద లేని నీటి లభ్యత, మేడిగడ్డ వద్ద ఎలా ఉందని హరీశ్‌రావును నిలదీశారు. ఆ ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పాల్సిందేనంటూ మంత్రి శ్రీధర్‌బాబు జతకలిశారు. ఇందుకు బదులిచ్చిన హరీశ్‌రావు… మేడిగడ్డ వద్ద ఏయే వాగులు కలుస్తాయో చిట్టా మొత్తం చదివేసరికి.. జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబుకు నోట మాటరాలేదు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇలాగే పలుసార్లు ప్రశ్నించి, హరీశ్‌రావు నిలదీస్తూ మరీ అవగాహన పెంచుకున్నారు. ఇంత చిన్నచిన్న ప్రశ్నలనును శాసనసభలో అడిగిన మంత్రులు.. తమ పరువు తీసుకున్నారని, మంత్రుల అజ్ఞానాన్ని ఓపికగా చిన్నపిల్లలకు క్లాస్ చెప్పినట్టుగా హరీశ్ చెప్పారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
శభాష్… హరీశ్
ఆదివారం నుంచి బీఆర్ఎస్ వర్గాలు, రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం.. ‘శభాష్… హరీశ్’. మంత్రులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నా.. డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ఎక్కడా తొణకకుండా సభలో వీరోచితంగా సమాధానాలు చెప్పారని అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జూపల్లి, శ్రీధర్‌బాబు ప్రశ్నల ఎపిసోడ్లో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్ల దూరం ఉందని, తమ్మిడిహట్టి దిగువన మేడిగడ్డ వద్ద మహారాష్ట్ర నుంచి చెనంకేరి వాగు, మట్టాపూర్, అహిరి, అబన్పల్లి, కోల్పల్లి, వాట్రాల్, లంకాచేను, పోచంపల్లి, మేడారం, క్రిష్ణపూర్, పెంటిపాక, తుమ్నూరు, ఎపెట, వాడం, కుట్టిపల్లి సహా మొత్తంగా 16 వాగులతోపాటు తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయి, వట్టివాగు, చెలిమెల వాగు, గొల్లవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగులు కలుస్తాయని, ఇలా తమ్మిడిహట్టితో పోల్చితే మేడిగడ్డ దగ్గర 120 టీఎంసీల నీటి లభ్యత ఎక్కువ ఉంటుందని సీడబ్ల్యూసీ నివేదికతోపాటు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు హరీశ్‌రావు ఇచ్చిన సమాధానాల వీడియోలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారి చక్కర్లు కొడుతున్నాయి.
కాంగ్రెస్ కోటలో కమలం!
సీఎం రేవంత్, నీటిపారుదల మంత్రి ఉత్తమ్, మంత్రుల ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానం చెప్తున్నప్పుడు అధికారపక్షం నుంచి సభ్యులు మధ్యలో కలగజేసుకున్నారు. ప్రతిపక్షం వాయిస్ వినిపించకుండా అధికారపక్షం వ్యవహరించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ.. మరో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నుంచి కూడా ఆటంకాలు ఎదురుకావడం అనూహ్యమని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. హరీశ్‌రావు మాట్లాడుతుంటే.. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అడ్డుతగలడం విడ్డూరం అనిపించిందని వివరిస్తున్నారు. పెద్దవాగు తప్ప మరే ప్రాజెక్టు తమ్మడిహట్టి దిగువ ఉండబోదంటూ పాల్వాయి హరీశ్ అజ్ఞానం బయటపెట్టుకోవడం, కాంగ్రెస్, బీజేపీ రహస్య బంధాన్ని అసెంబ్లీ వేదికగా చాటుకున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి ప్రశ్నలను హరీశ్‌రావు చిత్తు చేశారని అభినందిస్తున్నారు.