హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యానికి కాంగ్రెస్ సర్కార్ తెరలేపింది. తొలుత కార్పొరేషన్‌కు మంజూరైన పోస్టులకే ఎసరు పెట్టింది. 50శాతం పోస్టులను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఈ మేరకు ఎస్సీ డీడీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం సమర్పించినట్టు తెలుస్తున్నది. 1964 సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సొసైటీ ఏర్పాటైంది.
కార్పొరేషన్ నిర్వహణకు, సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రత్యేకంగా జీవో 4 ద్వారా గత బీఆర్ఎస్ సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీ, జీఎంతోపాటు మొత్తంగా 32 మంది సిబ్బందిని మంజూరుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలకు సైతం ఒక్కో జిల్లాకు ఈడీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), ఈవో (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), ఏఈవో (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)తోపాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులన్ని కలిపి 15 చొప్పున 465 పోస్టులను మంజూరుచేసింది. వీటితో కలిపి మొత్తంగా 497 పోస్టులను మంజూరుచేసింది. ఇదిలా ఉంటే 31 జిల్లాలకు మంజూరైన ఈడీ పోస్టుల్లో 50 శాతం పోస్టులను ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసేందుకు ప్రస్తుతం సర్కారు కసరత్తు చేస్తున్నది.
కార్పొరేషన్లో 50శాతం పోస్టులను ఎస్సీడీడీకి బదలాయింపు ప్రతిపాదనల వెనుక భారీకుట్రనే దాగి ఉన్నదని కార్పొరేషన్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. వాస్తవంగా 33 జిల్లాలున్నా ఎస్సీ డీడీ 10 జిల్లాలకే డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు మంజూరై ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్ల ద్వారా ఈడీ పోస్టులను భర్తీ చేయాలనే నిబంధనను అదునుగా తీసుసుకుని ఇప్పటివరకు ఎస్సీ డీడీ అధికారులనే జిల్లాల్లో ఈడీ పోస్టులను భర్తీచేస్తున్నారు. ఈ విషయమై ఎస్సీ డీడీ కమిషనర్, కార్పొరేషన్ ఇన్చార్జి ఎండీ క్షితిజను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించింది. కార్పొరేషన్‌కు సంబంధించి 50 శాతం ఈడీ పోస్టులను కేవలం ఎస్సీడీడీకే గంపగుత్తగా బదలాయించాలనే ప్రతిపాదనలు ఏమైనా చేశారా? అని అడగగా అలాంటిదేమీ లేదని ఆమె వెల్లడించారు.