కరీంనగర్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ హెచ్చరించారు. శనివారం కరీంనగర్‌లోని టీఎన్జీవో సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెలకు రూ.700 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, కంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయీస్ హెల్త్ స్కీంను ప్రవేశ పెడతామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. జీపీఎఫ్ బిల్లులు ఇవ్వడం లేదని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పిల్లల పెండ్లిళ్లు చేయలేక పోతున్నామని, కుటుంబం గడవడానికి చేసిన అప్పులు తీర్చలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇతర సంక్షేమ పథకాలకు వాడడం వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఆర్సీ గురించి ఎలాంటి ప్రస్తావన చేయడం లేదని, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇదివరకే మంత్రులు, అధికారుల కమిటీలు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం మళ్లీ కమిటీల పేరిట కాలయాపన చేస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెల 15 తర్వాత ప్రత్యక్ష పోరాటానికి దిగి, తమ విశ్వరూపం చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఆచరణలో పెట్టాలని అడుగుతున్నామని, ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలని ప్రశ్నించారు. ఆగస్టు 15 వరకు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చామని వెల్లడించారు. ఉద్యోగులు అసహనానికి గురికాకముందే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవోల సం ఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కోడేరు, ఆగస్టు 9 : నాటు తుపాకీతో ఓ వ్యక్తి పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. కోడేరు మం డలం ఎత్తం గ్రామానికి చెందిన బోయ లక్ష్మణ్ అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మిద్దె కృష్ణయ్యను హతమారుస్తానని శనివారం మధ్యాహ్నం మద్యం మత్తులో నాటు తుపాకీ దగ్గర పెట్టుకొని తిరిగాడు. గమనించిన స్థానికులు కృష్ణ య్య దృష్టికి తీసుకెళ్లగా.. స్థానికుల సాయంతో అతడిని పట్టుకొని పోలీసు స్టేషన్లో అప్పగించారు.