హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మక్క రైతులకు కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపుతున్నది. మక్కల కొనుగోలుకు ససేమిరా అంటున్నది. ఓవైపు తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూనే మరోవైపు ఆ రైతుల పంటల కొనుగోలుకు నిధులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నది. ఈ మేరకు మక్కల కొనుగోళ్లపై ఆంక్షలు విధించినట్టు తెలిసింది. మక్కలు ఎక్కువగా కొనుగోలు చేస్తే రైతులకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సర్కార్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు స మాచారం. అందుకే మార్క్‌ఫెడ్ అధికారులకు మక్కల కొనుగోలులో కోత పెట్టాలని మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన మక్కలను కొనవద్దని, రైతులను నిరుత్సాహపర్చాలని సూచించినట్టు తెలిసింది. రైతులను విసిగించడం ద్వారా వారు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేలా పురిగొల్పాలని అంతర్గతంగా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
మక్కల కొనుగోలుకు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించొద్దని, ఆలస్యం చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల మక్కల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రాలు ప్రారంభమైనచోట కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 200 కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం 15 రోజుల క్రితం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 50 కేంద్రాలను మాత్రమే ప్రారంభించినట్టు తెలిసింది. అవి కూడా రైతులు ఎక్కువగా గొడవ చేసే ప్రాంతాల్లోనే ప్రారంభించినట్టు సమాచారం. తమ వద్ద కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రపోజల్ పెట్టిన చోట కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నట్టు తెలిసింది.
యాసంగిలో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా సుమారు 30 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఈ పంట మొత్తం కొనుగోలు చేయాలంటే రూ.7 వేల కోట్లు అవసరమవుతాయి. కనీసం 10 లక్షల టన్నులు కొనుగోలు చేసినా రూ.2400 కోట్లు కావాలి. ఇంత భారీ ఆర్థిక భారం మోయలేమని సర్కార్ తేల్చి చెప్పినట్టు తెలిసింది. మొన్నటి వానకాలంలో 4 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేసిన సర్కార్ రైతులకు రూ.907 కోట్లు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లించేందుకు నానా తంటాలు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మక్కలు కొనుగోలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మార్క్‌ఫెడ్ సిబ్బందికి మక్కల కొనుగోళ్లను అడ్డగోలుగా చేపట్టొద్దని, సర్కార్‌పై ఆర్థిక భారం మోపొద్దని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. మక్కల కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం 5వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం సర్కార్ కుటిల ఆలోచనకు ఉదాహరణగా నిలుస్తున్నది. ఈ క్రమంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓవైపు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర దక్కక మరోవైపు ప్రభుత్వం కొనుగోళ్లలో కోత పెడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ఉంది. కానీ బహిరంగ మార్కెట్లో రూ.1500 నుంచి రూ.1700 మాత్రమే ధర వస్తున్నది. అంటే రైతులు క్వింటాలుకు రూ.900 వరకు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారాలు, వ్యాపారాలను పక్కనపెట్టి రైతులను ఆదుకోవాల్సిందిపోయి సర్కారే స్వయంగా ఇలాంటి దారుణమైన ఆలోచనలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు మక్కలు తడిసిసోయి నష్టపోయారు… ఇప్పుడు మరోసారి వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు.