హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) విభాగాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తదనుగుణంగా సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మైనర్ ఇరిగేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలకు రూపకల్పన చేసింది. త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నదని సమాచారం.
రాష్ట్రంలో సాగునీటి శాఖ అత్యంత కీలకమైంది. పరిపాలనా సౌలభ్యం, ప్రాజెక్టుల సత్వర మరమ్మతు పనుల నిర్వహణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ శాఖను పునర్వ్యవస్థీకరించింది. మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ విభాగాలను తొలగించి టెరిటోరియల్ ప్రతిపాదికగా చీఫ్ ఇంజినీర్లను నియమించింది. అంతేకాకుండా ప్రాజెక్టుల మరమ్మతు, మెయింటనెన్స్ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండొద్దనే సదుద్దేశంతో ఓఅండ్ఎం విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసింది. ప్రత్యేకంగా ఈఎన్సీని నియమించింది. అదేవిధంగా ఈఈలు మొదలు చీఫ్ ఇంజినీర్ల దాకా పనులను చక్కబెట్టేందుకు ఆర్థిక అధికారాలను సైతం కట్టబెట్టింది. రూ.10లక్షల నుంచి 50లక్షల వరకు చీఫ్ ఇంజినీర్ల స్థాయిలోనే ఓఅండ్ఎం కమిటీ సమావేశమై పనులు చేసే వెసులుబాటును కల్పించారు. ప్రస్తుతం 19 టెరిటోరియల్ సర్కిళ్లలో చాలామంది సీఈలు ఆ కమిటీ సమావేశాలనే నిర్వహించడం లేదు. రూ.10లక్షల సంబంధించిన పనులను కూడా ఓఅండ్ఎం రాష్ట్ర కమిటీ ఆమోదానికే పంపేలా రూపకల్పన చేసింది. గత ఐదేండ్లుగా ఆ మేరకు పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్‌శాఖను పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఓఅండ్ఎంను రద్దుచేయాలని నిర్ణయించడం గమనార్హం.
ప్రస్తుతం ఇరిగేషన్లో మొత్తం ఆరు ఈఎన్సీ పోస్టులు ఉన్నాయి. అందులో మూడు జనరల్, అడ్మిన్, ఓఅండ్ఎం, కాగా, మిగతా 3 టెరిటోరియల్ స్థాయిలో ఉన్నాయి. ప్రభుత్వం ఆ ఈఎన్సీ పోస్టులను పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమైంది. ఓఅండ్ఎం, టెరిటోరియల్ ఈఎన్సీ పోస్టులను రద్దు చేస్తున్నది. వాటి స్థానంలో కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కి, ఇంటర్ స్టేట్, డ్యామ్‌సేఫ్టీ, హైడ్రాలజీ విభాగాలకు కలిపి ఒక ఈఎన్సీ, సెక్రటేరియట్‌లోని అడిషనల్ సెక్రటరీకి పోస్టుకు ఈఎన్సీని, అదేవిధంగా వాలంతరీ డైరెక్టర్ జనరల్(డీజీ) పోస్టును ఈఎన్సీగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఓఅండ్ఎం విభాగాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇరిగేషన్ శాఖను మేజర్, మైనర్ విభాగాలుగా మళ్లీ వేరు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా నాలుగు మేజర్ ప్రాజెక్టులను నిర్ధారించింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా ఒక్కో చీఫ్ ఇంజినీర్ (సీఈ)ను, మైనర్ ఇరిగేషన్‌కు ప్రత్యేకంగా సీఈని నియమించనున్నారు. అదేవిధంగా హైడ్రాలజీ, క్వాలిటీ కంట్రోల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీవో), కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ విభాగాలకు ప్రత్యేకంగా సీఈ పోస్టులను కొనసాగించనున్నారు. ఇక ప్రస్తుతమున్న 19 టెరిటోరియల్స్ సీఈ పోస్టులు యథావిధిగా కొనసాగించనున్నారు. టెరిటోరియల్ సీఈలే నిర్దేశిత జిల్లా పరిధిలోని మేజర్, మీడియం ప్రాజెక్టులకు ఇన్‌చార్జీలుగా వ్యవహరించనుండటంతో పాటు, ఓఅండ్ఎం పనులను నిర్వహించాల్సి ఉన్నది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నదని ఇరిగేషన్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి.