Inter Board | పీవీ తెచ్చిన ఇంటర్ విద్యకు మంగళం.. బోర్డు రద్దు దిశగా కాంగ్రెస్ సర్కార్
Inter Board | సంస్కరణలకు ఆద్యుడు.. తెలంగాణ తేజం పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది.
Inter Board | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): సంస్కరణలకు ఆద్యుడు.. తెలంగాణ తేజం పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఇంటర్ విద్యను కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది. దేశానికే ఆదర్శం, సక్సెస్‌కు చిరునామా అయిన ఇంటర్ విద్యను రద్దు చేయనున్నది. ఈ దిశలో సర్కార్ ఆగమేఘాల మీద కసరత్తు చేస్తున్నది. ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. 1968లో అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు నేతృత్వంలో ఇంటర్ బోర్డుకు అడుగులు పడ్డాయి. పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ఇంటర్మీడియట్ విద్య ప్రారంభమైంది.
అప్పటివరకు 11వ తరగతి హెచ్ఎస్సీగా, 12వ తరగతి పీయూసీ(ప్రీ యూనివర్సిటీ కోర్సు)గా కొనసాగేవి. దానిని సంస్కరించిన పీవీ ఇంటర్మీడియట్ విద్య పేరుతో కొత్త రూపాన్ని ఇచ్చారు. 1970 అక్టోబర్ 25న ఇంటర్మీడియట్గా మారుస్తూ అప్పటి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. 1969-70 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 120 పాఠశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఇంటర్ కోర్సులను ప్రారంభించారు. 1971లో ఇంటర్ బోర్డును ఏర్పాటు చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ఇంటర్ బోర్డు విద్యార్థులకు సేవలందిస్తున్నది. ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన సంస్కరణకు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారే మంగళం పాడేందుకు ప్రయత్నిస్తున్నది. తమకు బద్ధ వ్యతిరేకి అయిన బీజేపీ పార్టీ తెచ్చిన ఎన్ఈపీ పాలసీని అనుసరించి ఇంటర్ బోర్డును రద్దు చేయడానికి వేగంగా పావులు కదుపుతుండటం విశేషం.
ఇంటర్‌కే డిమాండ్ ఎక్కువ
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లంటే మన దగ్గర యమక్రేజ్. ఈ స్కూళ్లల్లో సీట్ల కోసం సిఫార్సులు సర్వసాధారణం. అయితే ఇది కేవలం పదో తరగతి వరకే. ప్లస్ టు లెవల్‌కు వచ్చేసరికి విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. 10వ తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో చదివిన విద్యార్థులు.. ప్లస్ 2కి మాత్రం ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో చేరుతున్నారు. ఏటా 35-40 వేలకు పైగా విద్యార్థులు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లకు గుడ్‌బై చెప్పి.. ఇంటర్‌బోర్డు గుర్తింపు పొందిన జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఉదాహరణకు భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు 275 మంది విద్యార్థులు చదువగా, 11వ తరగతిలో 40, 12వ తరగతిలో కేవలం 28 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్లంతా ఇంటర్ విద్యకే జై కొట్టారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనూ ఏటా ఇదే జరుగుతున్నది. ఇంటర్ బోర్డు సిలబస్ అనేక పరీక్షలకు ఉపయోగపడుతుండడం, ప్రతిభావంతులైనవారు, గణితంలో మంచి స్కోర్ చేయగలిగిన వారు సైతం ఇంటర్ బోర్డు బాట పడుతున్నారు. సీబీఎస్ఈలో గణితం ఒక పేపర్‌కు 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా, మన దగ్గర రెండు పేపర్లకు గాను 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇది కూడా మరో కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
డ్రాపౌట్ అనేది సాకు మాత్రమే..
ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయడం ద్వారా డ్రాపౌట్లను తగ్గించవచ్చని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ఇంటర్ అధ్యాపక సంఘాలంటున్నాయి. పదో తరగతి పాసయ్యే వారి వివరాలు, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు దాదాపు దగ్గరగానే ఉంటున్నాయి. పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు పాలిటెక్నిక్, బాసర త్రిపుల్ ఐటీ, ఐటీఐ వంటి కోర్సుల్లో చేరుతుంటారు. అయినా ఇంటర్ అడ్మిషన్లు దరిదాపుల్లోనే ఉంటున్నాయని అధ్యాపక సంఘాల నేతలు చెబుతున్నారు. అలాంటప్పుడు డ్రాపౌట్లు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. బోర్డు విలీనానికి డ్రాపౌట్‌ను సాకుగా చూపించడం తగదని అభిప్రాయపడుతున్నారు.
గతంలోనూ విలీనానికి ప్రయత్నం
గతంలోనూ ఇంటర్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ విఫలమయ్యాయి. 1994 జనవరి 5న ప్రభుత్వం జీవో 82 జారీ చేసి ఇంటర్ బోర్డును విలీనం చేసింది. అధ్యాపకులు, ఉపాధ్యాయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 4న జీవోను రద్దు చేసింది. 2009లోనూ విలీన ప్రయత్నాలు జరిగాయి. ప్రభుత్వం మంత్రులతో బృందాన్ని నియమించింది. ఈ బృందం అందరి నుంచి అభిప్రాయాలు సేకరించింది. అత్యధికులు విలీనాన్ని వ్యతిరేకించారు. మళ్లీ తాజాగా కాంగ్రెస్ సర్కార్ విలీన అంశాన్ని తెరపైకి తెచ్చింది.
అభ్యంతరాల వెల్లువ
- ఇంటర్ బోర్డును రద్దు చేయడం కొఠారి కమిషన్ సిఫార్సులకు విరుద్ధం.
- స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్లుంటారు. ఇదే ఇంటర్‌కు వచ్చేసరికి ఫిజిక్స్ ఒక్కటే ఫిజిక్స్, కెమిస్ట్రీగా విడిపోతుంది. బయాలజీ సబ్జెక్టు జువాలజీ, బోటనీగా విడిపోతుంది. ఫిజిక్స్, బయాలజీ టీచర్లు ఇంటర్ సబ్జెక్టులను ఎలా బోధించగలరు.
- కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులుంటాయి. ఇంత లోతైన సబ్జెక్ట్‌లను టీచర్లు బోధించగలరా?
- జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల శిక్షణపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. మళ్లీ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకునే రోజులొస్తాయి. కోచింగ్ సెంటర్ల హవా పెరుగుతుంది.
- తమిళనాడు, కేరళ, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఇంటర్ అడ్మిషన్ ఒక దగ్గర ఉంటే.. విద్యార్థి మరో కోచింగ్ సెంటర్లో క్లాసులు వింటున్నారు. ఇంటర్‌బోర్డును రద్దు చేస్తే మన దగ్గర సైతం ఇదే జరుగనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

