Telangana Budget | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణం తదితర రూపాల్లో, వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెట్టి, వాటిని ప్రత్యక్ష, పరోక్ష ఆదాయ మార్గాలుగా మార్చి.. తద్వారా సంపదను సృష్టించి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినియోగించాల్సి ఉంటుంది.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా బడ్జెట్లో తూతూ మంత్రంగా మూలధన వ్యయం నిధులను కేటాయిస్తున్నది. తద్వారా అభివృద్ధిపై శ్రద్ధ లేదనే సంకేతాలను ఇస్తున్నది. రిజర్వ్‌బాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కానీ, రేవంత్ సర్కారు మాత్రం తిరోగమనం దిశగా సాగుతున్నదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం మూలధన వ్యయం కింద రూ.36,504 కోట్లు కేటాయించింది. మొత్తం 3.04 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా అందులో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు 12% లోపే. ఈ దఫా బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ.2.26 లక్షల కోట్లుగా చూపించారు. దీనితో పోల్చినా మూలధన వ్యయం 16 శాతమే. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూలధన వ్యయాన్ని నామమాత్రంగా కేటాయిస్తూ.. రాష్ర్టాన్ని పదేండ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీగా మారుస్తామంటూ గొప్పలు ప్రచారం చేసుకుంటున్నారని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చివరగా 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మూలధన వ్యయం కింద రూ.37,524 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది తొలి రెండు నెలల్లోనే అంటే ఏప్రిల్, మే నెలల్లోనే రూ.6,785 కోట్లు ఖర్చు చేసినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. తద్వారా కేటాయింపుల్లో 18% ఖర్చు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలధన వ్యయం కేటాయింపులను తగ్గిస్తూ వస్తున్నది. 2024-25 బడ్జెట్లో రూ.33,486 కోట్లు కేటాయించింది. దాదాపు రూ.4వేల కోట్లు తగ్గించింది. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 36,504 కోట్లుగా పేర్కొన్నది. అంటే కేసీఆర్ ప్రభు త్వ చివరి బడ్జెట్ కంటే రూ.వెయ్యి కోట్లు తక్కువే.
కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టింది. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా మూలధన వ్యయం పెంచింది. 2014-15లో రాష్ట్ర బడ్జెట్ పరిమాణం రూ.లక్ష కోట్లు మాత్రమే. సొంత పన్నుల రాబడి రూ.29,288 కోట్లు మాత్రమే. దీంతో మొదటి సంవత్సరం మూలధన వ్యయంగా రూ.11,583 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత ఏటేటా మూలధన వ్యయాన్ని పెంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. ఇదే సమయంలో కరోనా విజృంభించి, ప్రపంచం మొత్తం ఆర్థికంగా కుదేలైంది. దేశంలోనూ ఆర్థిక వృద్ధి మందగించింది. అయినా, కేసీఆర్ ప్రభుత్వం వెనకి తగ్గలేదు. మూలధన వ్యయం కింద ప్రాజెక్టులు కొనసాగించేందుకే మొగ్గు చూపింది.
కరోనా కష్టపెట్టిన 2019-20లో రూ.34,051 కోట్లు, ఆ మరుసటి సంవత్సరం రూ.34,327 కోట్లు మూలధన వ్యయానికి కేటాయించారు. మొత్తంగా పదేండ్లలో రూ.4.04 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేసినట్టు నిరుడు ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది. ఈ నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఫె్లైఓవర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, భవనాల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఫలితంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు తదితర అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమైంది. ఇది రాష్ట్ర ఆదాయాన్ని మెరుగుపరిచింది. ఫలితంగా తెలంగాణ ఏర్పడేనాటికి రూ.29వేల కోట్లుగా ఉన్న సొంత పన్నుల ఆదాయం పదేండ్లలో రూ.1.36 లక్షల కోట్లకు పెరిగింది. నాలుగు రెట్లకుపైగా వృద్ధి నమోదైంది.
అత్యధిక మూలధన వ్యయం కేటాయిస్తున్న రాష్ట్రాల్లో 2014-15లో తెలంగాణ 12వ స్థానంలో ఉండగా.. 2023-24 నాటికి ఐదో స్థానానికి పెరిగింది. మూలధన వ్యయం వృద్ధిరేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. 2014-15తో పోల్చితే 2023-24 నాటికి రాష్ట్ర మూలధన వ్యయం 580% పెరిగింది. దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధికం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా మూలధన వ్యయాన్ని గణనీయంగా తగ్గించింది. గత బడ్జెట్లో కేటాయించిన రూ.33,486 కోట్లు కొవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ తలకిందులైన రోజులకంటే తక్కువ. దీనిని బట్టే ప్రభుత్వ తీరు అర్థమవుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ఆర్థిక సంవత్సరం మూలధన వ్యయం
2023-24 (కేసీఆర్ సర్కారు చివరి బడ్జెట్) : రూ.37,524 కోట్లు
2024-25 (రేవంత్ సర్కారు తొలి బడ్జెట్) : రూ.33,486 కోట్లు
2025-26 ((రేవంత్ సర్కారు రెండో బడ్జెట్) : రూ.36,504 కోట్లు