ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పేదల ఇండ్ల కూల్చివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇండ్లను శుక్రవారం రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. పలు ఇండ్లు ఎఫ్టీఎల్లో ఉన్నాయని కొలతలు తీస్తూ నంబర్లు వేశారు. స్థానికులు తమ ఇండ్లను మార్కింగ్ చేయవద్దని అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్నాం.. మున్సిపల్ పర్మిషన్, ట్యాక్స్, కరెంటు బిల్లులు, ఆధార్‌కార్డులు ఉన్నాయని అధికారులు, సిబ్బందిని నిలదీశారు. గుడిసెలు, రేకుల ఇండ్లను కూల్చి వేయాలని చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి తమ ఉసురుతగులుతుందని మహిళలు శాపనార్థాలు పెట్టారు.