హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) మలి విడత నిర్వహించాలని సర్కారు యోచిస్తున్నది. తొలి విడుత పరిషత్, పంచాయతీ ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు సమాయత్తం అవుతున్నది. ఈ మేరకు పురపాలిక ఎన్నికల ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ముందస్తు చర్యలకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇటీవల కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం, జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలో వార్డుల విభజన ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు.
డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లను కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. డిసెంబర్ వరకు పరిషత్, పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో పురపోరుకు సిద్ధంకావాలని రేవంత్ సర్కారు భావిస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కార్యవర్గాల పదవీకాలాలు ముగిసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని వరుసగా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 144 మున్సిపాలిటీలు, 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు మినహా మిగతా 13 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ముగిసింది. సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట మినహా 139 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు కూడా తీరింది. దీంతో మొత్తం 152 పురపాలికలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఇందులో జీహెచ్ఎంసీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు ఉన్నది. ఇందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో ఇప్పటికే 152 పురపాలికల్లో పాలకవర్గాల గడువు ముగిసింది. ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. కొవిడ్ మహమ్మారి కారణంగా 2020 జనవరి నుంచి 2022 మధ్యకాలంలో వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో దాదాపు 92 శాతం మున్సిపల్ పాలకవర్గాల గడువు తీరిపోయింది. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. గత జనవరి నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో 15వ ఫైనాన్స్ నిధులు రాక అనేక మున్సిపాలిటీల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.2,780 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త మున్సిపాలిటీలు, కొత్త గ్రామాలు విలీనమైన మున్సిపాలిటీల్లో కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే సుమారు 22 నెలలు ఆలస్యమయ్యాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా మరింత ఆలస్యమైతే స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ నేపథ్యంలో జనవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
144 మున్సిపాలిటీలు
16 మున్సిపల్ కార్పొరేషన్లు
మొత్తం160
పాలకవర్గాల గడువు ముగిసిన మున్సిపాలిటీలు 139
పాలకవర్గాల గడువు ముగిసిన కార్పొరేషన్లు 13