BAI | శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 : ‘ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంలోనైనా కాంట్రాక్టర్లు సులువుగా పనిచేసుకుంటరు.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు’ అంటూ బీఏఐ (బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రతినిధులు వాపోయారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, ఇప్పటికైనా క్లియర్ చేయకుంటే అన్ని కాంట్రాక్టు పనులను నిలిపివేస్తామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని హెచ్చరించారు. కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చర్ క్లబ్లో సోమవారం బీఏఐ తెలంగాణ శాఖ కమిటీ, వివిధ సెంట్రల్ కమిటీల కొత్త చైర్మన్లను ఎన్నుకున్నారు. అనంతరం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఏఐ మాజీ అధ్యక్షుడు సీనయ్య, ఉపాధ్యక్షుడు ఎస్‌ఎన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.220 కోట్ల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. తాము కార్పొరేట కాంట్రాక్టర్లకు వ్యతిరేకం కాదని, చిన్న కాంట్రాక్టర్లు తమ కార్యాలయాల్లో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొన్నదని, బిల్లులు రాక కార్యాలయాల్లో దీక్షలు చేసే పరిస్థితి వచ్చిందని వాపోయారు.
అఫ్ఘనిస్తాన్లోనైనా కాంట్రాక్టర్లు సులువుగా పనిచేసుకొనే పరిస్థితి ఉన్నదని, ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పనులు సరిగా చేయకుంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని చూస్తున్నారు తప్ప పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు పడుతున్న బాధలను అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. రూ.కోటిలోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తామని స్వయంగా సీఎం చెప్పినా ఆ దిశగా అడుగులు వేయడం లేదని చెప్పారు. తమ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కాంట్రాక్టర్లు ఇక పనులు చేసే పరిస్థితి లేదని, త్వరలోనే కాంట్రాక్టులను ఆపేస్తామని, ఆ దిశగా ఓ తేదీని ప్రకటిస్తామని హెచ్చరించారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడిగా నియమితులైన డీవీఎన్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రతినిధులు ఘన ంగా సన్మానించారు. బీఏఐ మాజీ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా సేవలందించిన సీనయ్య, ఎస్ఎన్రెడ్డిలను సైతం బీఏఐ ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో బీఏఐ హైదరాబాద్ సెంటర్ చైర్మన్ సల్లా శ్రీనివాస్‌రావు, వివిధ సెంటర్ల చైర్మన్లు, బిల్డర్లు, ప్రముఖులు పాల్గొన్నారు.