PRLIS Project | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. పంప్హౌజ్ల్లోని మోటర్ల పనితీరును పరిశీలించేందుకు కూడా ససేమిరా అంటున్నది. విద్యుత్తు బిల్లులను చెల్లించేందుకు విముఖత చూపుతున్నది. మరోవైపు, కల్వకుర్తి పంప్‌హౌజ్‌లోని పంపులు కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఇంకోవైపు, నార్లాపూర్ పంప్‌హౌజ్‌ను, రిజర్వాయర్‌ను వినియోగించుకునే అవకాశమున్నా సర్కారు మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. దీంతో ఏంచేయాలో తెలియక ఇరిగేషన్ అధికారులు సతమతమ వుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌లో మొత్తం 4 పంపింగ్ స్టేషన్లు ఉండగా, ఉద్దండాపూర్ మినహా మిగతా మూడు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ 145 మెగావాట్ల సామర్థ్యంతో 8 పంపులు, ఏదుల పంపింగ్స్టేషన్లో 9, వట్టెం పంపింగ్ స్టేషన్లో 9 పంపులను ఏర్పాటు చేశారు. ఇవి డ్రై రన్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే పంపింగ్ స్టేషన్-1(నార్లాపూర్) పంపులను డ్రైరన్, వెట్న్ విజయవంతంగా నిర్వహించారు. ఏదుల, వట్టెం పంపులను డ్రైరన్, వెట్న్ కోసం అధికారులు సిద్ధంచేశారు. ఆయా పంపింగ్ స్టేషన్లకు విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో ఆ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. మోట ర్ల పనితీరును పరీక్షించేందుకు, విడిభాగాలను సంరక్షించేందుకు, పం పులను తిప్పి చూడటం పరిపాటి. అందుకు డ్రైరన్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి, వాటి మరమ్మతులను మోటర్లను సరఫరా చేసిన ఏజెన్సీలతోనే చేయించాల్సి ఉంటుంది.
అన్నీ సిద్ధమై న తరువాత వెట్న్ నిర్వహిస్తారు. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటర్ల అమరిక పూర్తయినా డ్రైరన్ నిర్వహించేందుకు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో వట్టెం పంప్‌హౌజ్ వరదతో మునిగిపోయింది. అప్పటికే సిద్ధం చేసిన నాలుగు పంపులు నీటిలో మునిగిపోగా, వాటిలో రెం డింటిని ఇటీవల పునరుద్ధరించారు. ఆ పంపు ల పనితీరును కూడా పరిశీలించాల్సి ఉన్నది.
అయితే, ప్రాజెక్టులోని అన్ని పంపింగ్ స్టేషన్లకు పవర్ సర్వీస్ కనెక్షన్‌ను విద్యుత్తు శాఖ కట్ చేసింది. రూ.500 కోట్ల మేర బకాయి బిల్లులను చెల్లిస్తేనే విద్యు త్తు కనెక్షన్ ఇస్తామని ఎస్పీడీసీఎల్, టీఎస్ ట్రాన్స్‌కో అధికారులు ఇరిగేషన్ శాఖకు తేల్చిచెప్పారు. ఆ బిల్లులు చెల్లించాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ఏడాదిగా మొరపెట్టుకుంటున్నారు. సర్వీస్ కనెక్షన్ చార్జీ లు చెల్లించాలని, మోటర్లను తిప్పి చూడాల్సి ఉన్నదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నా రు.
అయిప్పటికీ, ప్రభుత్వం మాత్రం బిల్లులను చెల్లించేందుకు ససేమిరా అంటున్నదని అధికారులు వాపోతున్నారు. పంపులను సరఫరా చేసిన ఏజెన్సీల అగ్రిమెంట్ పూర్తికాకముందే డ్రైరన్, వెట్న్ నిర్వహించాల్సి ఉంటుందని, అప్పుడే ఏవైనా లోపాలు తలెత్తినా, మరమ్మతులు చేయాల్సి ఉన్నా సదరు ఏజెన్సీతోనే చేయించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే ట్రాన్స్‌కోకు నిధులు చెల్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని అధికార వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.