హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్ కేంద్రంగా చూడాలన్న తెలంగాణ ప్రజల కల సాకారం కావడం లేదు. రైల్వే మ్యాప్‌లో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఈ జంక్షన్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ 4 దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్నది. ఇది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని స్థానిక నాయకులు, మేధావులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి గతంలో ఎంతో కృషిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాజీపేట రైల్వే డివిజన్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నాటి రాష్ట్ర మంత్రు లు, బీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయంపై కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో పక్షం రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకులు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిశారు. కాజీపేట జంక్షన్‌ను రైల్వే డివిజన్ చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
కాజీపేట జంక్షన్ మీదుగా నడుస్తున్న గూడ్స్ రైళ్లు, ప్రయాణికుల రైళ్ల ద్వారా అధిక ఆదాయం వస్తున్నది. బొగ్గుతోపాటు వివిధ రకాల పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, ప్యాసింజర్ టికెట్ల ద్వారా ఎంతో రాబడి సమకూరుతున్నది. ఇంత ప్రాధాన్యమున్న కాజీపేటకు కేంద్రం సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. రైల్వే డివిజన్ హోదా ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇది కచ్చితంగా తెలంగాణ పట్ల వివక్ష చూపడమేనని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో మండిపడుతున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో కొనసాగుతున్న కాజీపేట జంక్షన్ ఏ చిన్న సమస్య పరిష్కారం కోసమైనా సికింద్రాబాద్‌పైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో పలు కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. కాజీపేట కేంద్రంగా ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేస్తే నిర్ణయాలు వేగవంతంగా జరిగి సమస్యలు త్వరగా పరిష్కారమవడంతోపాటు వేలాది మంది స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా వరంగల్, హనుమకొండ లాంటి కీలక ప్రాంతాలు మరింత అభివృద్ధి చెంది ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. అందుకే కాజీపేట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాలవారు డిమాండ్ చేస్తున్నారు.
భారత రైల్వే నెట్‌వర్క్‌లో కాజీపేట జంక్షన్ది కీలకమైన స్థానం. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పాటుకు ముందే కాజీపేటకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. దేశంలోని మూడు ప్రధాన మార్గాలకు ఇది కేంద్రంగా కొనసాగుతున్నది. ఢిలీ-చెన్నై రైల్వే లైన్‌తోపాటు విజయవాడ కారిడార్, మహారాష్ట్రలోని బలార్షా మార్గాలకు అనుసంధానమై ఉన్న కాజీపేట సరుకు రవాణాతోపాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది.