టేకుమట్ల, ఫిబ్రవరి 17: మానేరు, చలివాగులు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతుంటే అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల- గుమ్మడవెల్లి గ్రామాల మధ్యలో చలివాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. గండ్ర వెంకటరణారెడ్డి హాజరై ఎండిపోయిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ సముద్రంలో కలిసే జలాలను బీడు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేశారని తెలిపారు. అలాంటి నాయకుడి పాలన ఒక్క ఏడాది లేకపోయే సరికి అన్నదాతలు అరిగోస పడే దుస్థితి వచ్చిందని చెప్పారు. అన్నారు. కేసీఆర్ పాలనలో మండలంలో కోట్ల రూపాయలతో చెక్ డ్యాం నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎండబెట్టి రైతుల కడుపు మంటకు కారణమైందని విమర్శించారు. వెంటనే చలివాగులోకి నీటిని వదిలి చెక్ డ్యామ్ నింపడంతోపాటు, డీబీఎం కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నాలు ఉధృతం చేస్తామని చెప్పారు.