హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీల జపం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. తెరవెనుక వారికి ఎగనామం పెడుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరికరాల కొనుగోలులో 90 శాతం సబ్సిడీ ఇవ్వగా.. దీన్ని కాంగ్రెస్ సర్కారు 50 శాతానికి తగ్గించింది. తద్వారా దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించేందుకు గానూ వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ప్రణాళికలు రచించింది. ఇందుకోసం ఇప్పటికే రూ.24.90 కోట్లు కేటాయించింది. ఇప్పటికే టెండర్లు పూర్తయి, ధరలను కూడా నిర్ణయించింది. ప్రస్తుతం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది.
నాడు 90 శాతం.. నేడు 50 శాతమే
కేంద్ర ప్రభుత్వ పథకమైన సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(స్మామ్)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఈ పథకానికి అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిన్న, సన్నకారు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ఆ నిబంధనలనే రాష్ట్ర సర్కారు ఇప్పుడు అమలు చేస్తున్నది. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతంగానే 2018లో పెద్ద ఎత్తున వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు పరికరాలను 90 శాతం సబ్సిడీపై అందించగా.. ఇతరులకు 50 శాతం రాయితీపై అందించింది. కానీ, కాంగ్రెస్ సర్కారు 40 శాతం కోత పెట్టడంతో ఆయా వర్గాల రైతులపై భారీగా ఆర్థిక భారం పడనుంది. కేంద్రంతో సంబంధం లేకుండా ఈ అదనపు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇచ్చినవే తీసుకోవాలి
2018లో బీఆర్ఎస్ అమలు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అధిక సబ్సిడీ ఇవ్వడమే కాదు.. రైతులకు అవసరమైన కోరుకున్న పరికరాలను సరఫరా చేసింది. కానీ, కాంగ్రెస్ సర్కారు ‘ఏవీ లేవు.. ఉన్నవి తీసుకెళ్లండి’ అనే విధంగా సరఫరా చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులకు ఎక్కువగా అవసరమయ్యే పరికరాలను కాకుండా ఇతర పరికరాలను జాబితాలో పొందుపరిచినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం సొం తంగా వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.951.28 కోట్లు ఖర్చు చేయగా కాంగ్రెస్ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రూ.24.90 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుండటం గమనార్హం. బీఆర్ఎస్ సర్కారు సుమారు 14 వేల ట్రాక్టర్ల ను పంపిణీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్‌కు ఒకటి చొప్పున 600 ట్రాక్టర్లను మాత్రమే ఇస్తున్నది. ఇక మండలానికో రోటవేటర్‌ను ఇస్తున్నది.నాడు బీఆర్ఎస్ 14 వేల ట్రాక్టర్లు, 31 వేల ఇతర పరికరాలు, 26 వేల స్ప్రేయర్లను పంపిణీ చేసింది. ఇప్పుడు పరికరాల సంఖ్యపై పరిమితి పెట్టడంపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.
మహిళల పేరిట మరో కుటిల పన్నాగం
రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులున్నారు. దీంతో అందరికీ పరికరాలు ఇవ్వలేక కాంగ్రెస్ సరాకరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే ఈ పథకాన్ని మహిళా రైతులకు మాత్రమే అమలు చేస్తున్నట్టు చెబుతున్నది. తద్వారా తక్కువ దరఖాస్తులు వస్తాయని పన్నాగం పన్నినట్టు తెలిసింది.