కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది. రుణ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు, వడ్డీని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నది. తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ), కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)కు సంబంధించిన రుణ వాయిదాలను మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తంగా రూ.1393.65 కోట్లను బకాయి పెట్టింది. ఆ మొత్తాన్ని ఈ నెల 29వ తేదీలోగా చెల్లించకుంటే ఆ రెండింటినీ నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తుల) విభాగంలో చేర్చుతామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్ తేల్చిచెప్పింది.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన రుణ వాయిదా చెల్లింపుపై ఆర్ఈసీ సీఎండీ 6న రాష్ట్ర ఇరిగేషన్, సీఏడీ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు లేఖ రాశారు. డెడ్‌లైన్‌కు కేవలం మూడు రోజులే గడువు ఉన్నా.. ఆ బకాయి చెల్లింపుపై రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీ), కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఏర్పాటుచేసింది. ఆ తరువాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సైతం ఈ రెండు కార్పొరేషన్ల నుంచే నిధులను సమకూర్చింది. నిధుల సమీకరణలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్‌సీఎల్) నుంచి రూ.37,737.11 కోట్లు, ఆర్ఈసీ నుంచి రూ.30,536.08 కోట్లు రుణాన్ని తీసుకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రుణ వాయిదాలను మార్చి నెల నుంచి చెల్లించకుండా ప్రాజెక్టుపై కక్ష సాధిస్తున్నది. టీఎస్డబ్ల్యూఆర్ఐడీసీకి 319.74 కోట్లు, కేఐపీసీఎల్‌కు 292.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. అసలు వడ్డీ కలిపి మొత్తం బకాయిలు రూ.1393.65 కోట్లుగా ఉన్నది. ఈ బకాయిలు జూన్ 28, 29 నాటికి చెల్లించకపోతే రెండు ఖాతాలు ఎన్పీఏ విభాగంలోకి వెళ్తాయి. వెంటనే మొత్తం బకాయి చెల్లించేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆర్ఈసీ సీఎండీ వివేక్‌కుమార్ దేవాంగన్ ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంతకుముందు ఏప్రిల్, మే నెలల్లో కూడా మూడు లేఖలు రాసినా పట్టించుకోలేదని, లోను అసలు, వడ్డీ చెల్లించక 68 రోజులు దాటిపోయిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇదే ఆర్ఈసీ గతంలో ‘ఏ క్యాటగిరీ’ గ్రేడ్ ఇచ్చింది. ఆర్ఈసీ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్ ఇస్తుంది. ఈ క్రమంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన నిధులను వినియోగించిన తీరు, వాటితో ఏమైనా ఫలితాలు వచ్చాయా? రుణ వాయిదాలను సక్రమంగా కడుతున్నారా? గడువులోగా వాయిదాలు చెల్లిస్తున్నారా? ఆయా ప్రాజెక్టుల నిర్వహణపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలను లోతుగా అధ్యయనంచేసి ఆ గ్రేడింగ్ ఇస్తుంది. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్’ను ఆర్ఈసీ ‘ఏ క్యాటగిరీ’లో చేర్చింది. ఈఆర్సీ ద్వారా ఏ గ్రేడ్ సాధించిన దేశంలోనే పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా, ఈ క్యాటగిరీలో స్థానం సాధించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం బీఆర్ఎస్ హాయంలో రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే ఆర్ఈసీ, అదే కార్పొరేషన్‌ను ఎన్పీఏ జాబితాలో చేర్చుతామని హెచ్చరించడం గమనార్హం. ఇదీ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతున్నది.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్. ఇది 2016లో మొదలైంది. 2019లో కాళేశ్వరం కార్పొరేషన్‌కు అదనంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. రుణ మొత్తాన్ని 2035లో ముగించాల్సి ఉన్నది. అయితే, మరో ఐదేండ్లు రుణాన్ని రీఅలైన్మెంట్ చేయాలని కాంగ్రెస్ సర్కారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రతిపాదనలు పంపించింది. ఆర్ఈసీ నుంచి తీసుకున్న రూ.30,000 కోట్ల రుణాన్ని 2025 వరకు చెల్లించి ముగించే విధంగా కేసీఆర్ సర్కారు ప్రాతిపాదించింది. అప్పు భారం త్వరగా దించుకోవాలని 2030వ సంవత్సరం వరకు 71 శాతం, 2031-35 సంవత్సరం వరకు 29 శాతం రుణం రీపేమెంట్ చేస్తామని పేర్కొన్నది. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు తెలంగాణపై అప్పు భారాన్ని మరో ఐదేండ్లకు పొడిగించింది. చెల్లించే కిస్తీ భారం తమపై పడకుండా రుణాన్ని రీఅలైన్మెంట్ చేయాలని కోరింది. 2030 వరకు 9 శాతం, 2031-35 వరకు 18 శాతం, 2036-40 వరకు 27 శాతం, 2040 ఆర్థిక సంవత్సరం తర్వాత 46 శాతం రుణాన్ని చెల్లిస్తామని ప్రతిపాదించింది.
తెచ్చిన అప్పులకు అసలు, వడ్డీ సకాలంలో చెల్లించకపోతే తెలంగాణ రాష్ర్టాన్ని డిఫాల్టర్‌గా చూపుతామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్ సంస్థ హెచ్చరించినట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన లేఖలను గురువారం ఆమె మీడియాకు అందజేశారు. ‘కేసీఆర్ ఆర్ఈసీ వద్ద అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టారు. తెచ్చిన అప్పులను కేసీఆర్ తిరిగి చెల్లించారు. ఆర్ఈసీ సంస్థ కేసీఆర్ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చింది. కానీ, ఆర్ఈసీ సంస్థకు రేవంత్ ప్రభుత్వం డబ్బులు కట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేకపోతే ప్రభుత్వాన్ని డిఫాల్ట్‌గా చూపుతామని ఆ సంస్థ చెప్పింది. అయినా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్పు, వడ్డీ చెల్లించకుండా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు కట్టబెడుతూ, కమీషన్లు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు’ అని కవిత ఫైరయ్యారు.