ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకుడు. ఈ సినిమాలో చైతూ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తారని చిత్రబృందం చెబుతున్నది. ఇది చైతూ కెరీర్లో 24వ చిత్రం కాగా, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే తన కెరీర్లో మైలురాయి వంటి 25వ చిత్రాన్ని కూడా ఆయన లైన్లో పెట్టేశారట. ఈ స్పెషల్ మూవీ కోసం తనకు అచ్చొచ్చిన జానర్నే చైతూ ఎంచుకున్నట్టు ఫిల్మ్‌వర్గాల సమాచారం.
చైతూ కెరీర్‌ని ఆసాంతం గమనిస్తే ప్రేమకథలే ఆయనకు విజయాలను అందించాయి. ఏమాయ చేశావే, మజిలీ, లవ్‌స్టోరీ, తండేల్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. త్వరలో ఆయన చేయబోయే 25వ చిత్రం కూడా ఓ అందమైన ప్రేమకావ్యమే అని తెలుస్తున్నది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. దర్శకుడిగా.. నాగచైతన్యతో ‘మజిలీ’ వంటి ప్రేమకథను తెరకెక్కించిన శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ దర్శకుడు క్లాక్స్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన వస్తే గానీ అసలు విషయం తెలిసే అవకాశం లేదు.