అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పునర్జన్మలతో ముడిపడిన ఈ కథలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా దీపికా పడుకోన్ నటిస్తున్నది. కీలకమైన అతిథి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనుందని ప్రచారం జరుగుతున్నది. ఈ భామ ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొంటున్నదని వార్తలొచ్చాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది మృణాల్ ఠాకూర్. అల్లు అర్జున్-అట్లీ ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మృణాల్ బదులిచ్చింది.
‘నిజంగా నేను ఆ సినిమాలో నటిస్తున్నానా? అలాంటి అద్భుతం జరగాలని మీరు ప్రార్థించండి. ఒకవేళ ఈ వార్త నిజమైతే మనందరం సెలబ్రేట్ చేసుకుందాం’ అంటూ కాస్త వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. దీంతో ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో మృణాల్ ఠాకూర్ ఇంకా ఖరారు కాలేదని, ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. అయితే రెండో నాయిక పాత్ర కోసం జాన్వీకపూర్‌తో పాటు మృణాల్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నదని ఫిల్మ్‌నగర్ టాక్.