Congress Govt | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ) : శాసనసభ ఎన్నికల వేళ మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ మహిళలు ఊరూరా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎవరిని కదిలించినా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో విరుచుకుపడుతున్నారు. ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం మహిళా దినోత్సవం సందర్భంగా 15 అంశాలతో చేసిన ప్రకటన మరిన్ని విమర్శలకు తావిస్తున్నది. చెప్పిందే చేయని సర్కారు.. చేయనివీ చేశామని చెప్పుకోవడం విడ్డూరమని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. సర్కారు చేసిన ప్రకటనలో తప్పులను ఎండగడుతూ ఇవిగో వాస్తవాలు అంటూ సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం పూర్తిగా మరిచిపోయారని మహిళా సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలకు ఎగనామం పెట్టారని మండిపడుతున్నారు. ఏడాది పాలనలో ఏమీ చేయకుండా అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా హామీలు, మాయమాటలు, అబద్ధాలను విజయాలుగా చాటింపు చేసుకోవడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రకటించిన పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు చిత్తశుద్ధి చూపాలని మెప్మా రిసోర్స్ పర్సన్ సునీత్ డిమాండ్ చేశారు.