హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణాలు పొందిన చేనేత కార్మికులు లబోదిబోమంటున్నారు. రూ. లక్ష లోపు రుణం తీసుకు న్న చేనేత కార్మికులకు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రుణం లో అసలు మాత్రమే మాఫీ చేయడానికి చర్య లు చేపట్టినట్టు తెలుస్తున్నది. వడ్డీని రుణగ్రహీత తిరిగి బ్యాంకులకు చెల్లిస్తేనే రుణం పొందిన అస లు సొమ్ము మాఫీ జరుగుతుందని అధికారులు తేల్చి చెప్తున్నారు.
ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. బ్యాంకులు సైతం లక్ష లోపు రుణం పొందిన వారి లెక్కలు తీస్తున్నారు. వారి అర్హతల గురించి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఉదాహరణకు.. ఒక చేనేత కార్మికుడు తన అవసరాల కోసం బ్యాంకు నుంచి రూ.90,000 రుణం తీసుకున్నాడు. దానికి మిత్తి రూ.25,000 అయింది. అసలు, మిత్తి కలిపితే రూ.1.15 లక్షలు మొత్తం ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించాలి. కానీ, ప్రభుత్వం ఇందు లో తిరకాసు పెట్టింది. బ్యాంకు నుంచి పొందిన రుణం రూ.90,000కే రుణమాఫీ జరుగుతుందని తేల్చింది. మిత్తి సొమ్ము రూ.25,000 ఆ చేనేత కార్మికుడే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
చేనేత కార్మికులు 6,600 మంది ఉన్నారని, రూ.33 కోట్లు చేనేత రుణమాఫీ కోసం అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. రుణమాఫీలో అనేక ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసలు, మిత్తి కలిపి మొత్తం సొమ్మును మాఫీ చేయాలని సంఘం నాయకుడు చెరుకు స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.