Udit Narayan | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నాడు. అతడి మొదటి భార్య రంజన ఝా బీహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో ఉదిత్‌తో పాటు ఆయన రెండో భార్య దీపా నారాయణ్, మరియు ఇద్దరు సోదరులపై ఫిర్యాదు చేసింది. 1996లో వైద్య పరీక్షల పేరుతో తనను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారంతా, తనకు తెలియకుండానే గర్భాశయాన్ని తొలగింపజేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ ఘటన జరిగి దశాబ్దాలు గడిచిన అనంతరం న్యాయం కోసం ఆమె ఇప్పుడు గళమెత్తడం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక రంజన ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
కాగా, ఉదిత్ నారాయణ్‌కు ఇలాంటి వివాదాలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా ఒక లైవ్ కాన్సర్ట్‌లో మహిళా అభిమాని పట్ల ఆయన ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫోటో అడిగిన అభిమానిని ఆయన ముద్దుపెట్టుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత ఆయన తన వివరణలో అభిమానులపై ఉన్న ప్రేమతోనే అలా చేశానని సర్దిచెప్పుకున్నప్పటికీ, తాజా కేసు ఆయన వ్యక్తిగత ప్రతిష్టను మరింత ప్రమాదంలోకి నెట్టింది. ఇటీవల విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’లో ‘మీసాల పిల్లా..’ అనే పాటతో అలరించాడు ఉదిత్ నారాయణ్.