హైదరాబాద్, సెప్టెంబర్13 (నమస్తే తెలంగాణ): కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. జలాల వాటాపై చెరోవిధంగా ప్రకటనలు చేస్తూ అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని చెప్తున్నారు. దీంతో ట్రిబ్యునల్‌లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కుతుం దా? అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ట్రిబ్యునల్‌లో తెలంగాణ వాదనలు తుది దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం, మంత్రి ప్రకటనలు చూస్తే సందేహాలు వస్తున్నాయని చెప్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం కేంద్రం మొదటిసారి 1969లో బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 (కేడబ్ల్యూడీటీ -1) ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 75శాతం డిపెండబులిటీ (100ఏండ్లలో 75ఏండ్లపాటు ఒక నదిలో వచ్చిన ప్రవాహాలను లెక్కగట్టి సగటు నీటి లభ్యతను తీస్తారు) ద్వారా మొత్తంగా కృష్ణాలో 2060 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, వాటి వినియోగం ద్వారా తిరిగి నదిలోకి 70టీఎంసీల జలాలు వస్తాయని అంచనా వేసింది.
మొత్తంగా కృష్ణాలో 2130 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. ఆ జలాల్లో మహారాష్ట్రకు 585టీఎంసీలు, కర్నాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 811టీఎంసీలను పంచింది. మొత్తంగా 330టీఎంసీల మిగులు జలాలు అందుబాటులో ఉంటాయని అవార్డులో ప్రకటించింది. ఈ కేటాయింపులను 2000 సంవత్సరం తర్వాత సమీక్షించుకోవచ్చని మొత్తంగా 1976లో ట్రిబ్యునల్ 1 తన తుది తీర్పును వెలువరించింది. బచావత్ ట్రిబ్యునల్-1 సూచనల మేరకు నాటి అవార్డును సమీక్షించేందుకు కేంద్రం 2004లో జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2) ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 65శాతం డిపెండబులిటీ కింద, సగటు ప్రవాహాల ఆధారంగా కృష్ణా నదిలో మొత్తంగా 2578టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. అందులో ట్రిబ్యునల్1 కేటాయించిన 2130 టీఎంసీలను మినహాయించి.. మిగిలిన 448టీఎంసీల జలాలను మూడు రాష్ర్టాలకు పంచింది. అందులో మహారాష్ట్రకు 81టీఎంసీలు, కర్నాటకకు 173టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 194టీఎంసీలను కేటాయించింది.
అందుకు సంబంధించిన అవార్డు డ్రాఫ్ట్‌ను 2010లో, తుది అవార్డును 2013లో కేడబ్ల్యూడీటీ 2 నివేదించింది. ట్రిబ్యునల్ తీర్పుపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉమ్మడి ఏపీ సర్కారుతోపాటు, మిగిలిన రాష్ర్టాలు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డు అమలులోకి రాకుండా పెండింగ్‌లో మిగిలిపోయింది. ఇదిలా ఉంటే ట్రిబ్యునల్ 1, ట్రిబ్యునల్ 2 రెండింటి ద్వారా ఉమ్మడి ఏపీకి ఇప్పటికే కృష్ణా జలాల్లో 1005 టీఎంసీలు దక్కాయి. ఇవి కాకుండా పోలవరం నుంచి కృష్ణాకు 80టీఎంసీలను డైవర్షన్ చేయగా, అవార్డు ప్రకారం ఆ జలాలను కూడా బేసిన్ రాష్ర్టాలకు పంచారు. అందులో ఉమ్మడి ఏపీకి 45, కర్నాటక, మహారాష్ట్రకు 35టీఎంసీలు ఉన్నాయి. మొత్తంగా కృష్ణాలో ఉమ్మడి ఏపీ వాటా 1050టీఎంసీలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలని నిర్ణయించారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. సెక్షన్89 ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పదేండ్లపాటు కేంద్రంపై కోట్లాడింది.
అవగాహన లేని సీఎం, మంత్రి
ట్రిబ్యునల్ 1 కేటాయించిన కృష్ణా జలాల్లో 75శాతం డిపెండబులిటీ కింద 555టీఎంసీలు, 65శాతం డిపెంబులిటీ కింద 575టీఎంసీలను కేటాయించాలని బీఆర్ఎస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నది. మొత్తంగా 71క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్లో నివసించే జనాభా, దుర్బిక్ష ప్రాంతాల ఆధారంగా మొత్తంగా 1050 టీఎంసీల కృష్ణా జలాల్లో మొత్తంగా 789టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంటుందని గతంలో నుంచి బీఆర్ఎస్ సర్కార్ వాదనలు వినిపిస్తూ వస్తున్నది. అయితే రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇష్టారీతిన ప్రకటనలు చేస్తూ తెలంగాణ జలహక్కులను ప్రమాదంలో పడేస్తున్నారని తెలంగాణ నీటిపారుదల నిపుణులు మండిపడుతున్నారు. గతంలో కృష్ణాలో 500టీఎంసీలను రాసిస్తే తెలంగాణకు చాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా కృష్ణా జలాల్లో 904టీఎంసీలు దక్కుతాయంటూ ప్రకటించారు. మంత్రి ఉత్తమ్ 811టీఎంసీల్లో 71శాతం నీటివాటా మాత్రమే దక్కుతుందంటూ ప్రకటించారు.
న్యాయమైన వాటా దక్కేనా!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరు చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కుతుందా? ట్రిబ్యునల్‌లో ఏమేరకు వాదనలు వినిపిస్తున్నారో అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నూతన మార్గదర్శకాల ప్రకారం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గత జనవరి నుంచి విచారణ చేపట్టింది. తెలంగాణకు సంబంధించిన వాదనలు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. 23, 24, 25వ తేదీల్లో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది. ఆ తర్వాత ఏపీ తన వాదనలను కొనసాగిస్తుంది. అయితే వాదనలు తుదిదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలోనూ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నీటివాటాలపై అవగాహన లేకపోవడం, భిన్న ప్రకటనలు చేయడం ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి ; అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ సూచన
కృష్ణా జలాల పునఃపంపిణీ లో న్యాయమైన వాటాకోసం ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈనెల 23నుంచి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట మరోసారి విచారణ ప్రారం భం కానుంది. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ ప్రత్యేకకార్యదర్శి ప్ర శాంత్జీవన్ పాటిల్, ఈఎన్సీ అమ్జద్హుస్సేన్, ఇరిగేషన్‌శాఖ ఇంటర్‌స్టేట్ విభాగం ఎస్ఈ సల్లా విజయ్‌కుమార్, ఈఈలతోపాటు ట్రిబ్యునల్‌లో తెలంగాణ తరపున వాదనలను వినిపిస్తున్న సీనియర్ న్యా యవాది వైద్యనాథన్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ వోహ్రా బృందంతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ శనివారం సమీక్షించారు. తెలంగాణకు రావాల్సిన వాటా కోసం వాదనలు వినిపించాలని కోరారు.