జూలూరుపాడు, మే 10: తమది ఇందిరమ్మ రాజ్యమని, రైతురాజ్యమని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పాలకులు.. రైతునడ్డి విరిచేశారని ఓ రైతు మండిపడ్డారు. రేవంత్ సర్కార్ రైతులను నిలువునా మోసం చేస్తున్నదని ఆరోపించారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన రైతులు 25 రోజుల క్రితం వరి పంటను కోశారు. పొరుగునే పడమట నర్సాపురంలోని కొనుగోలు కేంద్రానికి తమ పంటను తెచ్చారు.
ఇప్పటికీ అక్కడ కొనుగోలు చేపట్టలేదు. కాకర్ల గ్రామానికి చెందిన రైతు మిర్యాల దేవకుమార్.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్‌ను, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, అధికారులను కడిగిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు వీడియోలో ఆ రైతు ప్రభుత్వాన్ని నిలదీసిన అంశాలు ఇలా.. ‘ఏ-గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాకు రూ.2,389, కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ.2,369 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పింది. అదే ధరలతో కూడిన బ్యానర్ కూడా ఇక్కడ పెట్టింది. కానీ అధికారులు మాత్రం ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు.
ఎందుకంటే అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. రైతులు పంటను కోసి కొనుగోలు కేంద్రానికి తెచ్చి 25 రోజులుగా కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నా అధికారులు, ప్రభుత్వం కొనడం లేదు. గత్యంతరంలేక ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటున్నారు. క్వింటా వడ్లను రెండు కిలోల తరుగు చొప్పున కేవలం రూ.1,300కే తెగనమ్ముకుంటున్నారు. రైతుల బాధను ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా దయ ఉంచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రైతు మిర్యాల దేవకుమార్ తన వీడియోను ముగించారు.