హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నది. రికార్డుస్థాయిలో రుణాలు తీసుకుంటూ ప్రజలపై అప్పుల భారం మోపుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.2 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసింది. ‘ఎక్కడా అప్పు పుట్టడం లేదు’ అని సీఎం రేవంత్రెడ్డి ఓ వైపు చెప్తూనే మరో వైపు రికార్డుస్థాయిలో అప్పులు తెస్తున్నారు. 19 నెలల్లోనే రూ. 2 లక్షల కోట్లకుపైగా అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇలాగే అప్పులు తెస్తూ పోతే వచ్చే మూడేండ్లలో అప్పుల భారం రూ.6 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ఆదాయం అప్పుల వడ్డీ చెల్లింపులకే సరిపోక, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం దుర్లభమవుతున్నది. కాంగ్రెస్ పాలనలో ఆదాయ రాబడులు పెరగకపోవడం, అప్పులు భారీగా పెరిగిపోతుండటం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నది.ఆర్బీఐ, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), రాష్ట్ర ప్రభుత్వ డాటా ప్రకారం.. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2025 మధ్య కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.66 లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ర్టానికి కేంద్రం విధించిన రుణ పరిమితుల (ఎఫ్ఆర్బీఎం) కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.64,539 కోట్ల మారెట్ రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో జూలై ఒకటోతేదీ నాటికే రూ.18,900 కోట్ల మేర మారెట్ రుణాలను సమీకరించింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని రేవంత్ సర్కారు ఈ మొత్తాన్ని తీసుకున్నది. ప్రభుత్వ అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన సంస్థల (ఎస్పీవీ) ద్వారా ఎఫ్ఆర్బీఎం యేతర రుణాల కింద (ఆఫ్-బడ్జెట్ రుణాలుగా) రూ.15,000 నుంచి రూ.16,000 కోట్ల వరకు సేకరించింది.
ఇలా జూలై ఒకటో తేదీనాటికే రేవంత్రెడ్డి సర్కారుచేసిన అప్పు మొత్తం రూ.2,00,900 కోట్లకు చేరింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే వచ్చే మూడు నెలల్లో (జూలై-సెప్టెంబర్ 2025) ప్రభుత్వం మరో రూ.12,000 కోట్ల మారెట్ రుణాలు తీసుకోవడానికి ఆర్బీఐ నుంచి అనుమతులు కూడా పొందింది. ఇవి కాకుండా అదనంగా మరో రూ.10,000 కోట్ల వరకు రుణాలు సమీకరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. వీటిని కూడా అప్పుల చిట్టాలో కలిపితే తెలంగాణ ప్రజలపై రేవంత్ సర్కారు మోపే రుణభారం మరింత పెరుగుతుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అప్పులు చేసిన కారణంగా తమకు రుణం తీసుకొనే అవకాశం తగ్గిపోయిందని ఆరోపిస్తూనే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక, అనధికారిక మార్గాల్లో అప్పులను సమీకరిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు తీసుకున్న అప్పు మొత్తం, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో తీసుకున్న మొత్తం అప్పులో సగానికి దగ్గరగా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో రూ.4.17 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 19 నెలల్లోనే రూ.రూ.2,00,900 కోట్లు రుణ సమీకరణ చేసింది. ఐదేండ్లలో రూ.6 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపే ప్రమాదం ఉన్నది. ఇది కాంగ్రెస్ ఆర్థిక విధానాల్లో లోపాలను, నిర్వహణలో అసమర్థతను స్పష్టంగా తెలియచేస్తున్నది. బీఆర్ఎస్ పాలనలో అప్పులు పెరిగినప్పటికీ, అనేక ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను అమలు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తెచ్చినా, ఆ డబ్బు ఎకడ వినియోగిస్తున్నదనే దానిపై స్పష్టత లేదు.
ఈ అప్పుల భారం చివరికి సామాన్య ప్రజలపైనే పడనున్నది. పన్నులు పెరగడం, సేవల ధరలు పెరగడం, అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించడం వంటి భవిష్యత్తు పరిణామాలు భయపెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అప్పుల విషవలయం నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటపడేస్తుందో వేచి చూడాల్సి ఉన్నది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.