హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘యువ వికాసం’ పథకం పేరుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాన్ని నీరుగారుస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఎంఎస్ఎంఈ పాలసీని నిలిపివేసిన రేవంత్‌రెడ్డి సర్కారు.. కొత్త పాలసీని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నది. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించి ఏడాది కావస్తున్నా ఇంతవరకు దాని మార్గదర్శకాలు జారీ చేయలేదు. అవి వచ్చేవరకు ఎంఎస్ఎంఈలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కాగా, యువ వికాసం పథకానికి, ఎంఎస్ఎంఈ రంగానికి అసలు పొంతనే లేదని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు సెప్టెంబర్ 18న కొత్త ఎంఎస్ఎంఈ-2024 పాలసీని లాంఛనంగా ప్రారంభించింది. అధికారులు మార్గదర్శకాలను రూపొందించి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి పంపగా.. దానిపై ఏ నిర్ణయం తీసుకోకుండానే ఆయన ఫైల్‌ను వాపస్ పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ‘యువ వికాసం’ పథకం అమల్లో ఉన్నందున కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని మరికొంతకాలం పక్కన పెట్టాలని ఉన్నతాధికారులు పరిశ్రమల శాఖ అధికారులకు సూచించినట్టు సమాచారం. అసలు యువ వికాసం పథకానికి, ఎంఎస్ఎంఈలకు సంబంధం ఏమిటని పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
త్రిశంకు స్వర్గంలో పారిశ్రామికవేత్తలు
కాంగ్రెస్ సర్కారు తెచ్చిన నూతన ఎంఎస్ఎంఈ పాలసీ అమలుకు నోచుకోకపోవడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పాలసీ నిలిచిపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్త పాలసీని ప్రారంభించి ఇప్పటికే 11 నెలలైంది. ఆ పాలసీ అమలుకు సంబందించిన మార్గదర్శకాల రూపకల్పనకు గరిష్ఠంగా నెలరోజులైతే సరిపోతుంది. కానీ, ఆ పాలసీ పట్ల రేవంత్సర్కారుకు చిత్తశుద్ధి లేనందువల్లే మార్గదర్శకాలు వెలువడటం లేదని పరిశ్రమ వర్గాలు విమర్శిస్తున్నాయి. దేశంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 95 శాతానికిపైగా రూ.10 కోట్లలోపు పెట్టుబడితో కూడిన ఎంఎస్ఎంఈ పరిశ్రమలే. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు టీజీఐఐసీతోపాటు పరిశ్రమల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుం ది. ఆ అనుమతులను సులభతరం చేసేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘టీజీఐపాస్’ను అమల్లోకి తెచ్చింది. ఫలితంగా రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. అంతా సాఫీగా జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ సర్కారు నూతన పాలసీ పేరుతో ‘టీజీఐపాస్’ను నిలిపివేయడంపై పారిశ్రామిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
యువ వికాసానికి, ఎంఎస్ఎంఈలకు పొంతన ఎలా?
గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడితో కూడిన వ్యాపారాలకు 60 నుంచి 80% మేరకు రాయితీ కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ‘యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 5 లక్షల మంది యువతకు చేయుతనందించాలని నిర్ణయించింది. కాగా, కేంద్ర ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం గరిష్ఠంగా రూ.2.5 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన, వార్షిక టర్నోవర్ రూ.10 కోట్ల వరకు ఉన్న పరిశ్రమలు, వ్యాపారాలు సూక్ష్మ పరిశ్రమల కిందకు వస్తాయి. రూ.25 కోట్ల వరకు పెట్టుబడి, రూ. 100 కోట్ల వరకు టర్నోవర్ ఉన్నవాటిని చిన్న పరిశ్రమలుగా.. రూ.125 కోట్ల పెట్టుబడి, రూ.500 కోట్ల టర్నోవర్ ఉన్నవాటిని మధ్యతరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా కొత్త స్టార్టప్‌లు, ఇంటి నుంచి నడిపే చిన్నతరహా వ్యాపారాలు సూక్ష్మ పరిశ్రమల జాబితాలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని ‘యువ వికాసం’ పథకంతో ముడిపెట్టడం ఏమిటో ఎవ్వరికీ అంతుబట్టడంలేదు.
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీలోని కొన్ని ముఖ్యాంశాలు