Cheyutha Pension | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతున్నది. పింఛన్ పెరిగిందీ లేదు.. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డదీలేదు.. దీంతో ఎన్నికల హామీని తీర్చాలంటూ పింఛన్‌దారులు రోడ్డెక్కుతున్నరు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒకచోట ఆందోళనలకు దిగుతున్నరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా అభయహస్తం మ్యానిఫెస్టోలోని చేయూత కింద పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 44.70 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లు పెంచుతామని, దరఖాస్తు చేసుకున్న మరో పది లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని వాగ్దానం చేసింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్ల్లు, బోధకాలు బాధితులకు ఇచ్చే రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలు, దివ్యాంగులకిచ్చే రూ.4 వేల పింఛన్‌ను రూ.6 వేలు చేస్తామని చెప్పింది. కానీ, ఏడాది దాటినా కార్యరూపందాల్చలేదు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగానైనా స్పష్టమైన ప్రకటన వస్తుందనుకున్నా నిరాశే ఎదురైంది.
ఒక్కో లబ్ధిదారుకు 24 వేల బాకీ
గత డిసెంబర్ నుంచే పింఛన్‌దారులకు పెంచిన మొత్తం ఖాతాల్లో జమచేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుకు 12 నెలలకు రూ.24 వేల చొప్పున బకాయి పడ్డది. మొత్తంగా 44.7 లక్షల మంది లబ్ధిదారులకు సుమారుగా నెలకు రూ.894 కోట్ల చొప్పున 12 నెలలకు సుమారు రూ.10,728 కోట్లు చెల్లించాలి. ఆంధ్రప్రదేశలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది మార్చి నుంచి పింఛన్‌దారులకు బకాయిలు ఒకే విడతలో చెల్లించింది. కానీ, రేవంత్ సర్కారు మాత్రం ఏడాది దాటినా పింఛన్ మొత్తాన్ని పెంచకుండా దగా చేసిందని లబ్ధిదారులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో పింఛన్ లబ్ధిదారులు ఆందోళన బాటపడుతున్నారు. పలుమార్లు హైదరాబాద్‌లోని ప్రజాభవన్లోనూ, జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలోనూ వినతిపత్రాలు అందజేశారు. పింఛన్ పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రోడ్డెక్కుతున్నారు.
కేసీఆర్ పాలనలో ఠంఛన్‌గా..
కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు ఇలా ఆసరా లబ్ధిదారులందరికీ ఠంఛన్‌గా పింఛన్ వచ్చేది. నెలకు సుమారు రూ.వెయ్యికోట్లు ఆసరా పథకానికే వెచ్చించేది. 44.70 లక్షల మందికి ప్రతినెలా మొదటి వారంలోనే ఖాతాల్లో పడేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత 15 నుంచి 20 రోజులు ఆలస్యంగా ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమవుతున్నది.
కొత్త అర్జీదారుల ఎదురుచూపులు
ప్రభుత్వం కొత్తవారికి కూడా పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. దీంతో గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన సభల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వీరందరూ పింఛన్ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్ మొత్తం పెంచకున్నా కనీసం కొత్తవారికైనా ఇవ్వాలని అర్జీదారులు కోరుతున్నారు. మరణించిన వారిని, అనర్హులను తొలగించిన ప్రభుత్వం కొత్తవారికి మాత్రం మొండిచెయ్యి చూపుతున్నదని మండిపడుతున్నారు.
‘అవ్వా పింఛన్ ఎంతస్తున్నది? తాతా నీకెంతస్తుంది? రెండు వేలే కదా.. ఏం బాధపడకు పెద్దమ్మ.. వచ్చే డిసెంబర్ నెలల ఇందిరమ్మ రాజ్యమస్తుంది.. నీ ఖాతాలో నాలుగువేలు పడ్తయ్.. ఎవ్వరినీ అడుక్కోవాల్సిన పనిలేదు.. మందు గోళీలు కొనాలన్నా, మనుమడికి చాక్లెట్లు కొనియ్యాలన్నా రందీపడాల్సిన పనిలేదు.. పింఛన్ పెంచే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది.. అమ్మ జన్మదినమైన డిసెంబర్ 9నాడు ఎల్బీ స్టేడియంల ఒక్క సంతకం పెట్టి మీ ఖాతాల నాలుగువేలు వేసే బాధ్యత నాది.’
– నిరుడు అసెంబ్లీ ఎన్నికల సభల్లో రేవంత్‌రెడ్డి
హామీ నెరవేర్చకుంటే ఉద్యమిస్తాం
ఎన్నికల ముందు వృద్ధులు, వితంతవులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిజమేనని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది. ఏడాది దాటినా పట్టించుకోవడంలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించడంలేదు. ధర్నాలు, ఆందోళనలకు దిగినా పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా హామీ నెరవేర్చకుంటే ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం.
-కొల్లి నాగేశ్వర్రావు, వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు