హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్‌డీఎస్) ఫండ్స్‌ను విడుదల చేయడం లేదు. దీంతో దవాఖానల్లో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలోని దాదాపు 660 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 300 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లకు ప్రతి సంవత్సరం రెండు విడతల్లో హెచ్‌డీఎస్ నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు రూ.87,500 చొప్పున ఏటా ఒక్కో దవాఖానకు ఏటా రూ.1,75,000 చెల్లించాల్సి ఉంటుంది. పడకల సంఖ్యను బట్టి కొన్ని పెద్ద దవాఖానలకు ఏటా రూ.2,10,000 వరకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర సర్కార్ 40% చొప్పున కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిధులను ఆయా దవాఖానల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నచిన్న పనులు, రిపేర్లకు వినియోగిస్తారు. ఆ వ్యవహారాన్ని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు.
రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఊదరగొడుతుంటే వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత రెండేండ్లుగా హెచ్‌డీఎస్ నిధులను విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ దవాఖానల్లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో మందుల కొనుగోలుకు సైతం హెచ్‌డీఎస్ నిధులను వినియోగించాల్సి ఉన్నది. కానీ, ప్రభుత్వ జాప్యం వల్ల ఈ నిధులు విడుదలకాక దవాఖానల నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ వెంటనే స్పందించి హెచ్‌డీఎస్ నిధులను విడుదల చేయాలని, తద్వారా ప్రభుత్వ దవాఖానల్లో సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.