BRS | వరంగల్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షలాది మందితో నిర్వహించతలపెట్టిన రజతోత్సవ మహాసభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు. మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తు కూడా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణవాదులు లక్షలాదిగా తరలిస్తారని నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. దీంతో మహాసభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా పన్నాగాలు పన్నుతున్నది. అధికారం అండతో ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది. రజతోత్సవ మహాసభ జరగనున్న వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్-30 అమలులోకి తెచ్చింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజులపాటు ర్యాలీలు, సభలు, ఊరేగింపులను నిషేధిస్తున్నట్టు వరంగల్ సీపీ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం నుంచి నెల రోజులపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ నిర్వహణ సమయంలోనే సభలు, ర్యాలీలు, ఊరేగింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు నెల రోజులపాటు సిటీ పోలీస్ యాక్ట్-30 అమల్లో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉరేగింపులను నిర్వహించడంపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. తప్పనిసరిగా మైక్‌లను ఏర్పాటు చేయాలనుకునేవారు ఆయా ప్రాంతాల ఏసీపీల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలా అనుమతి తీసుకున్నా… ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైక్ వినియోగించుకోవాల్సి ఉంటందని చెప్పారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రవీంద్రభారతి, ఏప్రిల్ 6: హెచ్సీయూకు ప్రభుత్వం ఇచ్చిన భూమి అన్యాక్రాంతమైతే ఊరుకునేదిలేదని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కంచె గచ్చిబౌలి భూములపై కొందరు కన్ను వేసి కాంట్రాక్టర్లకు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ చర్యలు వెంటనే విరమించుకోవాలని, లేకుంటే విద్యార్థులతో కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేపడతుతామని స్పష్టంచేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆలిండియా ఓబీసీ స్టూండెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన హెచ్‌సీయూ, ఓయూ విద్యార్థుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ కృష్ణయ్య మాట్లాడారు.