Telangana | హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిన తపనకు ఇది నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్త భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయలేదు. కనీసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై తుది దశకు చేరిన పనులను కూడా పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందనడానికి ఇదే నిదర్శనం. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కనీసం దవాఖానలనైనా పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారా అంటే అదీ లేదు. మొత్తంగా పాతవి పూర్తి చేయరు.. కొత్తవి కట్టరు అన్న చందంగా తయారైంది పరిస్థితి.
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఉన్న భవనాల వైశాల్యం 30 లక్షల చదరపు అడుగులు మాత్రమే. నిజాంల కాలంలో నిర్మించినవాటితోసహా దవాఖానల వైశాల్యం మరో 20లక్షల చదరపు అడుగులు అని అధికారులు చెప్తున్నారు. అంటే రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న ప్రభుత్వ భవనాల వైశాల్యం కేవలం 50 లక్షల చదరపు అడుగులు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే కాకుండా ప్రజలకు మెరుగైన వసతులు అందించాలనే కేసీఆర్ ప్రభుత్వం అనేక నిర్మాణాలు చేపట్టింది. సచివాలయం, మెడికల్ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఇలా అనేక ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించింది. నిర్మాణాల్లో సింహభాగం భవనాలను గడువులోగా పూర్తిచేసింది. పదేండ్లలో సుమారు 2 కోట్ల చదరపు అడుగులకుపైగా అదనపు భవనాలను జోడించింది. దాదాపు 1.4కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు కేసీఆర్ హయాంలోనే అందుబాటులోకి వచ్చాయి. 5 సమీకృత కలెక్టరేట్ భవనాలు, 3 టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ ఎంజీఎం, పలు ఎమ్మెల్యే కార్యాలయ భవనాలు అన్నీ కలిపి మరో 60లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పుకోదగ్గ నిర్మాణాలేవీ చేపట్టలేదు. అంతేకాదు, తుదిదశలో ఉన్న భవన నిర్మాణాలను కూడా పూర్తిగా పక్కకు పెట్టింది. కనీసం ప్రజలకు అవసరమైన ఆసుపత్రుల నిర్మాణంపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నది. హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రులతోపాటు వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగు పెట్టడంతో పనులు సాగడం లేదు. ఫలితంగా తుదిదశకు చేరుకున్న భవనాలు అలాగే అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆదివారం ఆర్అండ్బీ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సమీకృత కలెక్టరేట్ల పెండింగ్ బిల్లుల అంశాన్ని అధికారులు ప్రస్తావించినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి స్పష్టమైన హామీ రాలేదట. సీఎంతో చర్చించి బిల్లులు చెల్లించేలా చూస్తానని చెప్పడంతో అవి ఎప్పటికి మంజూరవుతాయో అర్థంకావడం లేదని అధికారులు అంటున్నారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన భవనాలు పాలనాపరంగా ప్రజలకు సౌలభ్యంతోపాటు ఆవశ్యకమైన ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టం అవుతున్నది. సచివాలయం, సమీకృత కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు వంటివి చేపట్టారు.
గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలు ప్రస్తుత అవసరాలను తీర్చలేకపోతున్నాయన్న కారణంతో హైదరాబాద్ చుట్టూ మూడువైపులా రూ.2679 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాలు చేపట్టింది. రూ.1200కోట్లతో వరంగల్లో ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించింది. నాలుగు కలిపి సుమారు 50లక్షల చదరపు అడుగులమేర నిర్మాణాలు చేపట్టింది.