హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ) : పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్యం, మక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు.. ఇలా పంట ఏదైనా సరే ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎంత కొనాలని(కేంద్రం నిర్ణయించిన కోటా) చెబితే అంతే కొంటామని, అంతకుమించి గింజ కూడా ఎక్కువ కొనేది లేదని స్పష్టంచేసింది.
ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇన్ఫార్మల్ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాలను రాష్ట్ర సివిల్ సైప్లె శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు ఇలా పంటల కొనుగోళ్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైకి నెట్టేసింది. పంటల కొనుగోళ్లలో తమకేమీ బాధ్యత లేదన్నట్టు కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఏ పంటనైనా సరే కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామని క్యాబినెట్ సమావేశానంతరం మంత్రి ఉత్తమ్ మీడియాకు చెప్పారు.
పంటలకు మద్దతు ధరను కేంద్రమే నిర్ణయిస్తుంది కాబట్టి.. పంటల కొనుగోలు బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని చెబుతున్నారు. క్యాబినెట్ నిర్ణయం, మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఇకపై రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోదనేది సుస్పష్టం. కేంద్రం కొనుగోలు చేస్తామని చెప్పిన పంటలను, కేంద్రం ఇచ్చిన కోటా మేరకే ఇక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులతో రైతుల నుంచి సేకరించి కేంద్రానికి అందిస్తుంది. అంతేగానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోటాకు మించి పంటలు ఉత్పత్తి అయితే ఆ పంటలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కొనుగోలు చేయబోదు. పంటల కొనుగోళ్లలో కేంద్రం కోటా పూర్తికాగానే ఆ కేంద్రాలను మూసివేస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో పాటు ఇతర పంటలు ఉన్నా ఇక నుంచి ప్రభుత్వం పట్టించుకోదు.
కేంద్రం కొనేది 25శాతమే.. మిగిలిన పంట దైవాధీనం
రాష్ట్రంలోని వివిధ పంటలను కేంద్ర ప్రభుత్వం కొంత మేరకే కొనుగోలు చేస్తుంది. ఉత్పత్తి అయిన ధాన్యంలో మూడో వంతు మాత్రమే కొంటుంది. ఇక పెసర్లు, కందులు, జొన్నలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్ వంటి పంటలను మొత్తం ఉత్పత్తిలో 25శాతం మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అవసరముండి, పంట ఎక్కువగా ఉంటే మరో 5-10శాతం వరకు కొనుగోలుకు అనుమతి ఇస్తుంది. ఇలా మిగతా పంటలను ఎంతో కొంత కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మక్కలను మాత్రం అసలే కొనుగోలు చేయదు.
ఎంత ఉత్పత్తి అయినా సరే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన కోటా కింద కొనుగోలు చేయగా మిగిలిన పంటలను నాడు కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసేది. ఫలితంగా రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వారు పండించిన మొత్తం పంటను కొనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం తన కోటా మేరకు కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నది.
ఉత్పత్తి అయిన మొత్తం పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్నది. ఈ నేపథ్యంలో ఓ వైపు కేంద్రం 25శాతం పంటల్ని మాత్రమే కొనుగోలు చేయడం, మిగిలిన పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరకంగా మారింది. పంటల కొనుగోళ్లపై ఇటు రాష్ట్రం, అటు కేంద్రం చేతులెత్తేస్తుండటంతో మిగిలిన పంట పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
మిగిలిన పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలనే ప్రశ్నలు ఉత్పత్తి అవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో విక్రయిద్దామంటే మద్దతు ధర దక్కే పరిస్థితి లేదు. తప్పని పరిస్థితుల్లో విక్రయించినా రైతులు నష్టాలు మూటగట్టుకోవడం ఖాయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతువ్యతిరేక చర్యలతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తుల విక్రయం దైవాధీనంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెట్టుబడి పెట్టి పంటలు పండించిన రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
కేసీఆర్ హయాంలోనూ కేంద్రం ఇదే తీరు.. అయినా
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యంలో 3వ వంతు, ఇతర పంటల్లో 25శాతం కొనుగోలు చేయడం ఇప్పుడే అమలుచేసిన కొత్త విధానం కాదు. నాడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబించింది. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఒక దశలో అప్పటి సీఎం కేసీఆర్ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రైతుల తరఫున పెద్ద పోరాటమే చేశారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణ రైతుల పట్ల తన వివక్షను వీడలేదు.
కేంద్ర సహాయ నిరాకరణతో రాష్ట్ర రైతుల కోసం నాడు కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కొనుగోలు చేయని పంటలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో మొత్తం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా, కొనుగోలు చేసినా, చేయకపోయినా రైతులు పండించిన మక్కలు, జొన్నలు, కందులు, పెసర్లు, సోయాబీన్, శనగలు, సన్‌ఫ్లవర్ పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.12వేల కోట్లను ఖర్చు చేసింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో బహిరంగ మార్కెట్లో పంటలు కొనుగోలు చేసే దిక్కులేక రైతులు విలవిల్లాడిపోతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా అన్ని పంటలను మొత్తం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది.
రాష్ట్ర నిర్ణయంతో రైతులకు గడ్డుకాలమే
ప్రతిపక్షంలో ఉండగా పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ పార్టీ చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. కేంద్ర ప్రభుత్వం పంటలు కొనుగోలు చేయకపోతే రాష్ట్రం ప్రభుత్వం ఏం చేస్తుందని, రైతుల పంటలు కొనుగోలు చేసేందుకు కూడా పైసలు లేవా? అంటూ నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పంటనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, అంతేకాదు.. మద్దతు ధరకు అదనంగా బోనస్ కూడా చెల్లిస్తామని ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే పంటల కొనుగోళ్లపై చేతులెత్తేసింది.
నాడు పదేండ్ల పాటు రైతులకు ఇబ్బందుల్లేకుండా కేసీఆర్ పంటలు కొనుగోలు చేస్తే.. ఇప్పుడు రేవంత్ సర్కార్ రెండున్నరేండ్లకే తమ వల్ల కాదని చేతులెత్తేసింది. కేంద్రం విధించిన కోటా మేరకే కొనుగోలు చేస్తామని, ఆపై గింజ కూడా కొనేది లేదంటూ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం రైతులపాలిట శాపంగా మారనున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్కార్‌పై నమ్మకంతో పం టలు పండించే రైతుల పరిస్థితేమిటి? ప్రభుత్వమే కొనకుంటే ఎక్కడ విక్రయించాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నమ్మి అధికారం కట్టబెడితే తమ జీవితాలనే ఆగం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉత్పత్తి చేసిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతుల చేతిలో సర్కార్‌కు చావుదెబ్బ ఖాయమని హెచ్చరిస్తున్నారు.
ఉత్పత్తి అయిన పంటల్లో కేంద్రం కొనుగోలు చేసేది

కేంద్రం కొనకపోతే రాష్ట్రమే కొనాలె రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవా?
రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల వడ్లు కొనలేరా? ఇక్కడి రైతులు ఓట్లేసి గెలిపిస్తే వరి వేయొద్దని ఎట్లా అంటరు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది. సర్కారేమైనా బ్రోకరా..? మాకు 10వేల కోట్లు ఇవ్వండి. ధాన్యం ఎలా కొనుగోలు చేయాలో చేసి చూపిస్తాం.
– 2021 నవంబర్ 28న రైతుదీక్షలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ వ్యాఖ్యలు
కేంద్రం చెప్పినంతనే కొంటం!
‘పంటల ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన కోటాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇకపై కేంద్రం ఏయే పంట ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించిన మేరకు కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
– గురువారం సచివాలయంలో రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం