హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు అత్యుత్సాహం చూపిన ప్రభుత్వం విచారణ కమిషన్‌కు సంబంధించిన బిల్లులను మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. ఇరిగేషన్‌శాఖలో సైతం నూతన ఇంజినీర్ల నియామకపత్రాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం, ఆ ఏర్పాట్లకు సంబంధించిన బిల్లులను కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఏజెన్సీలు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారణ చేసి 100 రోజుల్లో నివేదికను అందజేయాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకు కమిషన్‌కు రూ.2.5 కోట్లను కేటాయించింది. ఆ తరువాత ఈ ఏడాది జూలై 31వ తేదీన తుదినివేదికను సమర్పించే వరకు కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం పొడగిస్తూ వచ్చింది. దీంతో సవరించిన అంచనాల ప్రకారం కమిషన్ బడ్జెట్ రూ.3.5 కోట్లకుపైగా చేరింది. బీఆర్కే భవన్ 8వ అంతస్తులో కమిషన్ కోసం ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, కొత్త కంప్యూటర్లు, డెస్క్‌లు, ఆఫీస్ ఫర్నీచర్ సదుపాయం కల్పించారు. కేటాయించిన బడ్జెట్లో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.5 కోట్లను మాత్రమే విడుదల చేసింది. ఆ నిధులు న్యాయమూర్తి, ఆయన ముఖ్యమైన సహాయ సిబ్బంది వేతనాలు, రవాణా, వసతికే ఖర్చయ్యాయి. ప్రభుత్వం ఇంకా దాదాపు రూ.2 కోట్ల నిధులను పెండింగ్‌లో పెట్టింది. కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఇతర సిబ్బంది వేతనాలను ఇప్పటికీ విడుదల చేయలేదని తెలిసింది. దీంతో ఫర్నిచర్, తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటుచేసిన ఏజెన్సీలు నిత్యం జలసౌధ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.
ఇరిగేషన్‌శాఖలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగాల్లో దాదాపు 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)లకు జలసౌధలో నిరుడు సెప్టెంబర్ 26న నియామకపత్రాలు అందించారు. ఆ ఏర్పాట్లకు దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చయినట్టు సమాచారం. ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఎంపికైన 437 మందికి ఈ ఏడాది మేలో నియామక పత్రాలను అందజేశారు. ఈ ఏర్పాట్లకు దాదాపు రూ.58 లక్షల వరకు ఖర్చయినట్టు బిల్లులు సమర్పించారు. నియామక పత్రాలను అందజేసి, చేతులు దులుపుకున్న ప్రభుత్వ పెద్దలు, వాటి బిల్లులను మాత్రం ఇప్పటికీ విడుదల చేయలేదు. ఇప్పటికైనా తక్షణం నిధులను విడుదల చేయాలని ఏజెన్సీలు కోరుతున్నాయి.