Warangal | వరంగల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సహజ వనరులపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. సొంత లాభం కోసం సహజ సంపదను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అడవులను పరిరక్షించి, అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. అడవులుగా ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు వేగంగా ముందుకు సాగుతున్నది. వరంగల్ మహానగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని దేవునూర్, ముప్పారంలోని వేల ఎకరాల అడవులు ఇందు కు కేంద్రబిందువుగా మారాయి. అడవిగా ఉన్న ఆ ప్రాంతాన్ని రైతుల పేరు చెప్పి బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నది. దశాబ్దాలుగా సాగు యోగ్యంగా లేని భూములను కొందరు రైతులకు చెందిన పట్టా భూములని పేర్కొంటూ అక్కడ ఉన్న భారీ వృక్షాలను కూల్చి వేస్తున్నది. కొందరు చిన్న రైతుల పేరుతో జీవ సంపదను, పర్యావరణాన్ని నాశనం చేసి, అధికార పార్టీలోని పలుకుబడి ఉన్న వారు వేల ఎకరాలను స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఫిర్యాదు చేసిన రైతుల చేతికి భూములు చేరగానే స్థానిక ముఖ్యనేత బంధువుకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
అటవీ భూముల్లోనే తమ పట్టా భూములు ఉన్నాయని, ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని అభ్యర్థిస్తూ ఇటీవల కొంతమంది స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. కడియం వెంటనే హనుమకొండ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు న్యాయం చేయాలనే ఎమ్మెల్యే ప్రతిపాదనపై కలెక్టర్ వేగంగా స్పందించారు. మార్చి మొదటి వా రంలో దేవునూరు గుట్టలను సందర్శించారు. మార్చి 12న రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టా ఉన్న రైతులకు అటవీ ప్రాంతంలోని భూములను అప్పగించాలని, ఇనుపరాతి గుట్టల నుంచి ఖాళీ చేయాలని హనుమకొండ జిల్లా అటవీ శాఖ అధికారికి మార్చి 27న ఆదేశాలు జారీ చేశారు. ఆ మరుసటి రోజు నుంచి అటవీ సంపదను ధ్వంసం చేసే ప్రణాళికలు వేగంగా రూపొందాయి. రెండు రోజులుగా బుల్డోజర్లతో ఈ ప్రక్రియ జరుగుతున్నది. దశాబ్దాలుగా అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు వారికి అప్పగించేందుకు కలెక్టర్ హడావుడి చేయడంపై విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని స్థలంలోనూ చెట్లు, అటవీ సంపద ఉంటే ప్రభుత్వ అనుమతితోనే తీసివేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ, ఇనుపరాతి గుట్టల ప్రాంతంలో మాత్రం జిల్లా ఉన్నతాధికారులే అటవీ సంపదను ధ్వంసం చేస్తున్నారు. రెండున్నర వేల ఎకరాల అడవిని చదును చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో 3,950 ఎకరాల్లో విస్తరించిన ఇనుపరాతి (దేవునూరు) గుట్టల అటవీ ప్రాంతం గొప్ప జీవావరణంతో నిండి ఉంటున్నది. వరంగల్ నగరం వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతం ఉన్నది. 1927లోనే రిజర్వ్ ఫారెస్ట్‌గా పేర్కొంటూ వేసిన హద్దు రాళ్లు ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా ప్రకటించాలని 1967లోనే అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం 1967లోనే ఇనుపరాతి గుట్టలను అటవీ బ్లాక్‌గా గుర్తించారు.సాంకేతికంగా రిజర్వ్ ఫారెస్ట్ కాకపోయినా, దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ అడవుల రక్షణ కోసం డీఎఫ్‌వో, రేంజ్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. 1996లో ప్రభుత్వ విధానం మేరకు వనసంరక్షణ సమితి ఏర్పాటు చేసి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (జేఎఫ్ఎం) నిధులతో చెక్‌డ్యాంలు, నీటికుంటలు, ఊటచెరువులు, రాక్‌ఫిల్ డ్యాంలు (ఆర్ఎఫ్ఎల్) నిర్మించారు. అనేక రకాల మొక్కలను నాటారు. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత ఇనుపరాతి గుట్టల ప్రాంతాన్ని సెంట్రల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (జేఎఫ్ఎం) విభాగంలోకి మార్చాలని ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత ఈ అడవిలో నీటి నిల్వ కందకాలు, కుంటలు, ఫాంపాండ్స్ నిర్మించారు. ఉపాధి హామీలో భాగంగా కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు కేటాయించి అడవిని అభివృద్ధి చేశారు. హరితహారంలో భాగంగా 125 ఎకరాల్లో లక్షల మొక్కలు నాటారు. నాటిన అధికారులే అటవీ భూములను వేరే వారికి ఇచ్చేందుకు దగ్గరుండి చెట్లను నరికేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని దాటుకొని 2 కిలోమీటర్ల మేరకు ఉన్న భూములు తమవేనంటూ చొచ్చుకు వెళ్లి భారీ మిషన్ల సహాయంతో చదును చేస్తున్నారు.
హనుమకొండ జిల్లాలోని ఇనుపరాతి గుట్టల అటవీ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు బుల్డోజర్లతో భారీ వృక్షాలను తొలగించి చదును చేసిన ప్రాంతం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి 3,850 ఎకరాల అటవీ భూమి ఉన్నట్టు నిర్ధారించింది. 343 ఎకరాల సీలింగ్ భూమి ఉండగా, 49 ఎకరాలను 20 మందికి అసైన్ చేశారు. దేవునూరు అటవీ శాఖ ఆధీనంలోని 148.29 ఎకరాలకు 8 మందికి, ముప్పారంలో 58.27 ఎకరాలకు పట్టాలు ఉన్నాయి. అటవీ ప్రాంతంలో ఈ భూములు లేవని నిర్ధారించారు. ఇప్పుడు అడవి ఉన్న ప్రాంతంలో ఈ భూములు లేవని స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారు లు అదే నిర్ధారిస్తున్నారు. దాదాపు 70 ఏం డ్లుగా అడవులే ఉన్నాయని, సాగు ఎప్పుడూ చేయలేదని నిర్ధారించారు. ఇటీవల కొందరు రైతులు ఎమ్మెల్యే కడియంను కలువగానే అడవిని చదును చేసే పనులను అడ్డుకున్నారు. ధర్మసాగర్ తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి అటవీ శాఖ అధికారులను అడ్డుకున్నారు. ధర్మసాగర్ మండలం ముప్పారంలోని 213,214,215,216 సర్వే నంబర్ల భూములు, దేవునూర్లోని 403, 404 సర్వే నంబర్ల భూములు అటవీ శాఖకు సంబంధించినవి కావని రెవెన్యూ అధికారులు చెప్పారు. ఇవే సర్వే నంబర్లు అటవీ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని అటవీ శాఖ అధికారులు వివరించారు. 48 ఏండ్ల క్రితమే రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించాలని ప్రతిపాదించిన భూములు ఇప్పుడు ప్రైవేటు భూములు ఎలా అవుతాయని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. 70 ఏండ్లుగా అడవిగా ఉంటూ, ఏ ప్రైవేటు వ్యక్తి సాగు చేయని భూములు అడవులుగానే కొనసాగుతాయని వివరించారు. అధికారులే అడవిని తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడంలేదని వాపోయారు.
ఇనుపరాతి గుట్టల పరిధిలోని దేవునూరు భూములు యాభై, అరవై ఏండ్లుగా అటవీ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. కొంత భూమి విషయంలో వివాదాలు ఉన్నాయి. స్పష్టత కోసం ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే చేస్తున్నాం. ఫైనల్ రిపోర్ట్ రాలేదు. రాగానే సమస్యను పరిష్కరిస్తాం.
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పరిధిలోని 214, 215, 216 సర్వే నంబర్లు, దేవునూర్ పరిధిలోని 403, 404 సర్వే నంబర్లలోని 25 ఎకరాల భూములు అటవీ శాఖ గతంలో ప్రతిపాదించిన రిజర్వు ఫారెస్టు డ్రాఫ్టు నోటిఫికేషన్లో లేవు. అటవీ శాఖ ఈ సర్వే నంబర్లలోని భూమిని గతం నుంచీ స్వాధీనంలో పెట్టుకున్నది. ఈ భూమి తమదే అని ముప్పారం, నారాయణగిరి గ్రామాలకు చెందిన కొందరు రైతులు చెప్పారు. రికార్డుపరంగా చూసి నేరుగా అక్కడికి వెళ్లి పరిశీలించి హద్దులు ఏర్పాటు చేశాం. ఈ ప్రతిపాదనలను అటవీ శాఖకు ఇచ్చాం. ముప్పారంలోని 213 సర్వే నంబర్ భూమి అంశం హైకోర్టు పరిధిలో ఉన్నది.
దేవునూరు, ముప్పారంలో 3,750 ఎకరాలు భూమి 1967 నుంచీ అటవీ శాఖ పరిధిలో ఉన్నది. మూడు నాలుగేండ్లుగా కొంతమంది పట్టాలున్నాయంటూ అటవీ శాఖ భూమి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ, అటవీ శాఖలు జాయింట్ సర్వే చేశాయి. సర్వే తుది నివేదిక రాలేదు. రాష్ట్ర స్థాయిలో మా డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ రాలేదు. కలెక్టర్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్తూ కొందరు ఫారెస్ట్ ల్యాండ్ మీదికి వస్తున్నారు. కలెక్టర్ కొద్దిరోజుల క్రితం మా డీఎఫ్‌వోకు ప్రొసీజర్ లెటర్ రాశారు. మేము సైట్ మీదికి వెళ్తే స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు మా మాట వినడం లేదు. ఈ భూములను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని అటవీశాఖ గతంలో ప్రతిపాదించింది. అప్పుడు రెవెన్యూ శాఖ మాకు ఒక మ్యాప్ ఇచ్చింది. ఆ మ్యాప్‌లో ఇప్పుడు చెప్తున్న సర్వే నంబర్లు లేనేలేవు. అప్పుడు లేనివి ఇప్పుడు ఎట్లా వస్తాయి.